Akshay Ajay on Heroes Remuneration : హీరోల రెమ్యునరేషన్ గురించి బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చాలా మంది నటులు సినిమా రిలీజ్‌కు ముందు పారితోషకాన్ని తీసుకోవడం లేదని, ప్రాజెక్ట్‌లో వచ్చిన లాభాల్లో షేర్ తీసుకుంటున్నారని అన్నారు. హెచ్‌టీ లీడర్షిప్ సమిట్‌లో పాల్గొన్న అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
లాభాల్లో షేర్
చాలా మంది హీరోలు సినిమాకు వచ్చే లాభాల్లో షేర్ తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటారని అక్షయ్ కుమార్ తెలిపారు. అయితే సినిమా అనుకున్న ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల హీరోలు తమ పారితోషికాన్ని పూర్తిగా వదులుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. అందుకు సినిమా పరిశ్రమపై ఉన్న మక్కువే కారణమని పేర్కొన్నారు. సినిమా సక్సెస్ అయితే హీరోలకు రెమ్యునరేషన్ వస్తుందని అన్నారు. ఒకవేళ సినిమా హిట్ కాకపోతే హీరోకు రెమ్యునరేషన్ రాదని చెప్పుకొచ్చారు. నిర్మాతతో పాటు హీరోకు నష్టాలు తప్పవని తెలిపారు.
'బాలీవుడ్లో ఐక్యత లోపించింది'
పెరుగుతున్న సినిమా బడ్జెట్ తగ్గట్టుగా హీరోలకు రెమ్యునరేషన్ సరిగ్గా అందడం లేదని వచ్చిన వార్తలపై అజయ్ దేవగణ్ స్పందించారు. ఏదైనా సినిమా సక్సెస్ అవ్వకపోతే తాను రెమ్యునరేషన్‌ను తీసుకోనని వెల్లడించారు. ప్రాజెక్ట్ రాబడి ఆధారంగా చాలా మంది నటులు పారితోషికం తీసుకుంటారని తెలిపారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమతో పోలిస్తే బాలీవుడ్లో ఐక్యత లోపించిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో అక్షయ్ కుమార్ సైతం ఏకీభవించారు.
అజయ్ దర్శకత్వంలో అక్షయ్
అక్షయ్ కుమార్‌తో తనకు ఎటువంటి విభేదాలు లేవని అజయ్ దేవగణ్ తెలిపారు. బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. సౌత్ సినీ ఇండస్ట్రీ తమ నటులకు మద్దతుగా ఉంటుందని వెల్లడించారు. ఈ లక్షణం బాలీవుడ్లో లేదని వ్యాఖ్యానించారు. అయితే బాలీవుడ్ స్టార్ట్ అక్షయ్, షారుక్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తాను ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నానని, అందులో అక్షయ్ ప్రధాన పాత్రలో కనిపిస్తారని ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేయడానికి ఇదే తగిన వేదికని అని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో తాను అజయ్ దర్శకత్వంలో నటించడం గొప్ప అనుభవమని అక్షయ్ వ్యాఖ్యానించారు.