ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తుంటే... కొందరు అక్రమార్కులు మాస్కులను భారీగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇంకొందరు నకిలీ శానిటైజర్లు తయారు చేసి ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల నకిలీ శానిటైజర్ల తయారీ కేంద్రంపై దాడి చేసిన రాచకొండ పోలీసులు ముగ్గురు సభ్యులు గల తయారీదార్ల ముఠాను పట్టుకున్నారు. తాజాగా మాస్కులు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
జియాగూడ ఇమామ్‌పురకు చెందిన గణేష్ మాస్కులు తయారు చేసి విక్రయించే వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతను ఒక్కో మాస్కును రెండు నుంచి మూడు రూపాయలకు తయారు చేసి... మార్కెట్‌లో 20 రూపాయలకు విక్రయించే వాడు. మాస్కులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతని ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు. ఎక్కువ ధరలకు విక్రయించడానికి సుమారు పది వేల మాస్కులను నిల్వ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇవీ చూడండి: మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్