కరోనా వైరస్ నియంత్రణకు చేపట్టిన జనతా కర్ఫ్యూకు ప్రజలంతా అద్భుతమైన రీతిలో సంఘీభావం తెలిపారని సీఎం కేసీఆర్ అన్నారు. సంఘీభావ ఐక్యతను చాటిచెప్పిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీఎం పేర్కొన్నారు.
కరోనా నివారణకు ఉన్నత స్థాయి కమిటీ చర్చించిందన్నారు. ఈనెల 31 వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని.. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
ప్రైవేటు ఉద్యోగులకూ వేతనం చెల్లించాల్సిందే...
ఇంటి అవసరాలకు సంబంధించి పాలు, కూరగాయల కోసం మాత్రమే బయటకు రావాలని చెప్పారు. బయటకు వచ్చిన వ్యక్తులు పక్కవారితో మూడు అడుగుల దూరం పాటించాలని సూచించారు. వారంపాటు ఒప్పంద, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు వేతనం చెల్లించాలని చెప్పారు. లాక్‌డౌన్ కాలంలో ప్రైవేటు ఉద్యోగులకు కూడా వేతనం చెల్లించాలని ఆదేశించారు.
రేషన్ కార్డుకు 12 కిలోల బియ్యం..రూ.1500 నగదు
రాష్ట్రంలో 87.59 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఒక్కో రేషన్‌కార్డుకు 12 కిలోల రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. బియ్యంతోపాటు ప్రతి రేషన్ కార్డుకు రూ.1500 నగదు అందజేస్తామని చెప్పారు.
ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆఫీసులకు రావక్కర్లేదు..
ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని సీఎం తెలిపారు. అత్యవసర సర్వీసుల ఉద్యోగులు అందరూ హాజరుకావాల్సిందేనని చెప్పారు. ఈనెలాఖరు వరకు అంతర్రాష్ట్ర సరిహద్దుతోపాటు ప్రజారవాణాను మూసివేస్తున్నామన్నారు.
ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి లేదు...
ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు అనుమతించబోమని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో అవి నడపడానికి వీలు లేదన్నారు. ప్రజలు గుమిగూడకూడదనే ఈ నియంత్రణ చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ విపత్తు ఎదుర్కోవాలంటే స్వీయ నియంత్రణ తప్పదని, ఎవరి ఇళ్లకు వాళ్లు పరిమిత కావాలనేదే ప్రధాన నిర్ణయమని తెలిపారు. లేని ఇబ్బందులు కొనితెచ్చుకోవద్దుని కేసీఆర్ సూచించారు.