జంటనగరాల్లో వరుణుడు శాంతించినప్పటికీ... పలు ప్రాంతాల్లో వరద ఉద్ధృతి కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మైలార్‌దేవ్‌పల్లి అలీనగర్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది గల్లంతయ్యారు. పల్లెచెరువుకు భారీగా వరదనీరు చేరుతుండగా దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఫలితంగా అలీనగర్ లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి... నీరు చేరింది. పల్లెచెరువు దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేయడం సహా..సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
పునరావాసం...
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్... రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ అలీనగర్‌లో పర్యటించి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. చెరువుకు... గండి పడకుండా చర్యలు చేపడుతున్నారు. వరద బాధితుల కోసం ఫంక్షన్ హాల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. చాంద్రాయణగుట్ట అల్ జుబైల్ కాలనీ ఇంకా జలదిగ్బందంలోనే ఉండగా సహాయక బృందాలు పడవ సహాయంతో ప్రజలను బయటకు తెస్తున్నారు. ఇళ్లల్లో ఉన్నవారికి భోజనాలు, పాలు అందిస్తున్నారు.
రాకపోకల నిలిపివేత...
ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట వెళ్లే రహదారిని అధికారులు.. ఈ రోజు కూడా మూసివేశారు. భారీ వర్షాలు, వరదల కారణంగా... గగన్ పహాడ్ వద్ద జాతీయ రహదారిపై రాకపోకల నిలిపివేత కొనసాగుతోంది. మట్టిలో పలు వాహనాలు కూరుకుపోగా సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని కార్లు, బస్సులను బయటకు తీశారు.
మనిషి లోతులో నీరు...
భారీ వర్షంతో జూబ్లీహిల్స్ కార్మికనగర్‌లో ఓ ఇల్లు కూలింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. సైదాబాద్ పరిధిలోని సింగరేణి పార్కు వద్ద వరదనీటిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని జేసీబీ సాయంతో బయటకు తీశారు. టోలీచౌకిలోని నదీమ్ కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకోగా మనిషి లోతు వరకు నీరు నిలిచిపోయింది.
సురక్షిత ప్రాంతాలకు ప్రజలు...
జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జోరు వానల కారణంగా మణికొండలోని ప్రధాన కాలనీలన్నీ జలమయమయ్యాయి. భగీరథి చెరువు నుంచి వస్తున్న వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మణికొండ- నార్సింగి ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. రోడ్డుపై ఉన్న నీటిని దిగువకు పంపగా, కింద ఉన్న అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తు వరకూ నీరు చేరింది.
మంత్రి పర్యటన...
అధికారులు సహయక చర్యలు చేపట్టారు. షేక్‌పేటలో కలవాల్సిన నాలా మూసుకుపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. నల్లకుంటలోని పలు కాలనీల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించగా... వరద బాధితులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. వారిని... సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
పానీపూరి కోసం వెళ్లి...
మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ న్యూ బోయిన్ పల్లిలో ఇళ్లలోకి వరదనీరు చేరింది. నిత్యావసర సరుకులు పూర్తిగా తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారులోని ఇంజాపూర్ వద్ద వాగులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. రెండ్రోజుల క్రితం పానీపూరీ తినేందుకు వెళ్లి గల్లంతైన ప్రణయ్, జయదీప్ తుర్కయంజాల్ చెరువు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వాగులోంచి యువకుల మృతదేహాలను వెలికితీశారు.
ఇదీ చూడండి: 'సహాయక చర్యలు లేకపోతే మీ పేరు రాసి చనిపోతాం'