Exercise on Telangana Budget 2024 : రానున్న ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక ప్రణాళిక తయారీ కసరత్తు ఇప్పటికే ప్రారంభమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది. ప్రతిపాదనల సమర్పణకు ఈ నెల 11వ తేదీతో గడువు పూర్తైంది. ఈ మేరకు దాదాపుగా అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఆయా శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. శాఖల వారీ ప్రతిపాదనల తయారీలో ఈ అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. వంద రోజుల్లోనే గ్యారెంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. అందులో రెండింటి అమలును కూడా ప్రారంభించింది. నెలాఖర్లోగా మరో ఒకటి లేదా రెండు గ్యారెంటీలను అమలు చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
నీటి పారుదల శాఖకు భారీ బడ్జెట్ - రూ.40 వేల కోట్లతో ప్రతిపాదనలు!
Telangana Budget 2024-2025 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని సర్కార్ చెబుతోంది. దీంతో వాటికి అనుగుణంగా కొత్త బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేయాల్సి ఉంది. ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నిధులను ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే అభయహస్తం గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా కోటీ పాతిక లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటి కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా పూర్తైంది. వీటన్నింటిని విశ్లేషించి, ఏ గ్యారెంటీకి ఎంత మంది దరఖాస్తు చేశారో గుర్తిస్తారు. ఆ తర్వాత గ్యారెంటీల్లోని పథకాల అమలు మార్గదర్శకాలను ఖరారు చేస్తారు. అనంతరం అర్హులను గుర్తించి పథకాల వారీగా అయ్యే వ్యయాన్ని అంచనా వేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నారు.
గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క
ఉద్యోగ నియామకాలను కూడా దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం కానున్నాయి. ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు తయారు కానున్నాయి. బడ్జెట్ ప్రతిపాదనల తయారీలో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను దృష్టిలో పెట్టుకున్నట్లు సమాచారం. కేంద్రం అమలు చేసే వివిధ పథకాలను దృష్టిలో పెట్టుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు రూపంలో కొంత మేర నిధులు ఇస్తే, కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో నిధులు పొందే విషయమై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేసినట్లు తెలిసింది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ రానుంది. రాష్ట్ర బడ్జెట్ ఆ తర్వాతే రానుంది. రాష్ట్రానికి వివిధ రూపాల్లో ఏ పథకాల కింద ఏ మేరకు నిధులు వస్తాయో కేంద్ర బడ్జెట్‌లో స్పష్టత రానుంది. ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు ఖరారు చేయనున్నారు. అడ్డగోలు ఖర్చులు, అనవసర వ్యయం, దుబారా లేకుండా చూడాలని సీఎం అధికారులను కోరారు. దీంతో తప్పనిసరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించినట్లు చెప్తున్నారు.
ఆశల పల్లకిలో కొత్త బడ్జెట్ - ఆర్థిక అవరోధాలను అధిగమించడం ఎలా?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24కు కేసీఆర్ ప్రభుత్వం రూ.2 లక్షల 90 వేల కోట్లతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెవెన్యూ ఆదాయాన్ని రూ.2 లక్షల 16 వేల కోట్లకు పైగా అంచనా వేశారు. అందులో నవంబర్ నెలాఖరు వరకు రూ.లక్షా 11 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి రెవెన్యూ రాబడులు రూ.లక్షా 60 వేల కోట్లకు పైగా వచ్చాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ ఆదాయం రూ.లక్షా 80 వేల కోట్లు దాటే అవకాశం ఉందని అంటున్నారు. నవంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రూ.లక్షా 44 వేల కోట్లకు పైగా ఉంది.
యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సహకరించండి - మనోజ్ సోనితో సీఎం రేవంత్ రెడ్డి
బడ్జెట్ ప్రతిపాదనలు పూర్తి వాస్తవికంగా ఉండాలని, గొప్పలకు పోవొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగానే ఈ సారి 2024-25 వార్షిక బడ్జెట్ రానుంది. అప్పులు, ప్రత్యేకించి కార్పొరేషన్ల ద్వారా తీసుకునే రుణాల విషయంలో రేవంత్ ప్రభుత్వం విముఖతతో ఉంది. దీంతో రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బడ్జెట్ ప్రతిపాదనల్లో కీలకం కానుంది. బడ్జెట్ కోసం ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ సమావేశాలు నిర్వహించనుంది. అన్ని శాఖలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి ప్రతిపాదనలను సమీక్షించనున్నారు. గణతంత్ర దినోత్సవం తర్వాత ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరగనుంది.