ఆర్టీసీ ఛార్జీల పెంపుదలకు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఏ తీరుగా పెంచాలన్న అంశంపై అధికారులు మేధోమథనం చేస్తున్నారు. అన్ని సర్వీసులపై కిలోమీటరుకు రూ. 20 పైసల చొప్పున పెంచనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు.
దూర ప్రాంత సర్వీసులకు ఛార్జీల పెంపుపై ఎలాంటి సమస్య లేకపోయినప్పటికీ నగర, పల్లెవెలుగు సర్వీసులకు ప్రయాణ దూరం తక్కువగా ఉండటంతో ఏ తీరుగా పెంచాలన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
చిల్లర సమస్య రాకుండా...
చిల్లర సమస్యను అధిగమించేందుకు ఛార్జీల పెంపులోనే సర్దుబాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. దూర ప్రాంతాల సర్వీసులకు కిలోమీటరుకు 20 పైసల చొప్పున పెంచితే కొన్ని ప్రాంతాలకు రూ. 182, రూ. 196లుగా ఛార్జీలు పెరుగుతాయి. ఆయా ఛార్జీలను రూ. 180 లేదా రూ. 200లుగా మార్చే అంశాన్నీ పరిశీలిస్తున్నారు.
పల్లె, నగర బస్సులకూ ఇదే విధానం అమలు చేయాలని యోచిస్తున్నారు. ఈ రెండు సర్వీసుల్లో కనీస ఛార్జీలను సవరించే విషయాన్ని పరిశీలిస్తున్నారు.
ఇవీ చూడండి: 'మున్సిపల్ ఎన్నికలకు తొలగిన న్యాయపరమైన చిక్కులు'