Excise Department Focus on Illegal Liquor Transport : తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసే మద్యం, డబ్బు, ఇతర ప్రలోభ వస్తువులను ఓటర్లకు పంపిణీ కాకుండా అడ్డుకోవడానికి ఖచ్చితమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా అప్రమత్తమైన ఆబ్కారీ శాఖ అక్రమ మద్యం అమ్మకాలు, గుడుంబా తయారీ, మాదక ద్రవ్యాల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతోంది. గడిచిన పది రోజుల్లో రూ.10 కోట్ల విలువైన మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్న అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.
ఎన్నికలను ప్రభావితం చేసే మద్యం, డబ్బు, ఇతర ప్రలోభాల కట్టడికి.. ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికార యంత్రాగం చర్యలు చేపడుతోంది. ప్రధానంగా మద్యం విక్రయాలు, సరఫరాపై ఆబ్కారీ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్రంలో 40 వేలకు పైగా మద్యం దుకాణాలు ఉన్నాయని అంచనా వేసిన ఆబ్కారీ శాఖ.. క్షేత్రస్థాయిలో పోలీస్ సిబ్బంది సాయంతో సోదాలు చేస్తోంది. ఓటర్లకు పంచేందుకు అనధికారికంగా మద్యాన్ని నిల్వ చేసిన వారిపై కొరఢా ఝుళిపిస్తోంది.
మద్యం విక్రయాలపై నిఘా పెరగడంతో కొన్నిచోట్ల గుడుంబా తయారు చేసి సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో దాడులు చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి.. గంజాయి, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు సరఫరా కాకుండా వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి రాష్ట్రంలోకి అక్రమ మద్యం చొరబడకుండా 21 చోట్ల తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 139 ఆబ్కారీ పోలీస్ స్టేషన్లు ఉండగా.. ఉమ్మడి జిల్లాల్లో పని చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ సహాయ కమిషనర్ల నేతృత్వంలో ప్రతి స్టేషన్‌కు ఒక బృందం పని చేసేట్లు కార్యాచరణ అమలు చేస్తున్నారు. జిల్లా టాస్క్‌ఫోర్స్, 10 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, మరో 4 రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశారు.
ఆబ్కారీ శాఖ కమిషనర్ జ్యోతి బుద్దప్రసాద్ నేతృత్వంలో.. ప్రతిరోజు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గుడుంబా తయారీ, గంజాయి సరఫరా, ఎక్కడ నాన్‌డ్యూటీపెయిడ్ మద్యం అమ్మకాలు ఉంటాయనే అంశంపై.. అధికారులు నిశితంగా పరిశీలన చేస్తున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. పలు రకాలుగా వస్తున్న సమాచారం ఆధారంగా కింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.8.70 కోట్లు విలువైన 2.5 లక్షల లీటర్ల మద్యం, 560 కిలోల గంజాయి, రూ.కోటిన్నర విలువైన మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్ జ్యోతి బుద్ద ప్రసాద్ తెలిపారు. మొత్తంగా రూ.10.2 కోట్ల విలువైన మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
EC Focus On Digital Payments : డిజిటల్ చెల్లింపులపై ఈసీ నజర్.. రూ. లక్ష దాటితే లెక్క చెప్పాల్సిందే