దేశ ప్రగతి, అభివృద్ధి కేవలం రహదారులపై ఆధారపడి ఉందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. అమెరికా లాంటి దేశం రహదారులను పునరుద్ధరించిన తర్వాతనే.. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. తన హయాంలో రాష్ట్రానికి అత్యధిక జాతీయ రహదారులు తీసుకురావడంతో.. దిగువ నుంచి రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం టాప్ 3 స్థానానికి చేరిందని వెల్లడించారు.
రాయగిరి- వరంగల్ నేషనల్ హైవే 2018లో మంజూరు కాగా తానంచర్ల- నకిరేకల్ను రెండో దశలో నాగార్జునసాగర్ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ రోడ్డు 95 శాతం పూర్తయిందని చెప్పారు. 'యాదాద్రి టు భద్రాద్రి' అనే నినాదంతో ఓఆర్ఆర్ గౌరెల్లి, పోచంపల్లి, వలిగొండ, తిరుమలగిరి, తొర్రూరు, మహబూబాబాద్, కొత్తగూడ మీదుగా కేంద్ర ప్రభుత్వం రోడ్డును మంజూరు చేసినట్లు ఎంపీ వివరించారు. 'గౌరెల్లి టు కొత్తగూడెం' హైవే 224 కి.మీ. రహదారికి వెంటనే నంబరింగ్ ఇచ్చి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 'నర్సాపూర్ టు చౌటుప్పల్' 399 కి.మీ రీజనల్ రింగ్ రోడ్డును వెంటనే ప్రారంభించాలని సూచించారు.
తెలంగాణలో రూ. 30-40 లక్షలు ఉన్న భూమి విలువ నేషనల్ హైవేల కారణంగా రూ. కోటి నుంచి రెండు కోట్లు పలుకుతోందని బూర నర్సయ్య తెలిపారు. దీని ద్వారా సంపద సృష్టి రూ. లక్ష కోట్లు పెరిగిందని వెల్లడించారు.
ఇదీ చదవండి: అక్రమార్కుల ఆగడాలు: ప్రైవేటు సర్వే నంబర్లు వేసి భూముల అమ్మకం