ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం. సంపాదనకు తగినట్లుగా ఖర్చులు, పొదుపు చేస్తూ ఉంటేనే ఆర్థికంగా నిలదొక్కుకోగలం. సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో.. అదే విధంగా మన సంపాదనను వినియోగించడంలోను అదే పద్ధతిని అవలంభించాలి.
- సన్నద్ధత ముఖ్యం
సంక్రాంతి నాడు పతంగులను ఆకాశంలోకి పంపించేందుకు కావాల్సిన ఏర్పాట్లను ముందే చేసుకోవాల్సి ఉంటుంది. దారం లేదా మాంజా తదితరాలను ముందే సమకూర్చుకుంటారు. అలానే పెట్టుబడులు పెట్టే ముందు సన్నద్ధత కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విషయాలపై పూర్తి పట్టు సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది.
- లక్ష్యం ఆధారంగా నడుచుకోవటం
పతంగి ఎత్తులో ఎగురుతున్నప్పుడు... కింద దానికి ఉండే దారం తెగకుండా చూసుకోవాలి. అప్పుడే అది ఇంకా ఎత్తుకు ఎగరగలుగుతుంది. పెట్టుబడి పెట్టగానే పెట్టుబడులను ట్రాక్ చేస్తూ ఉండాలి. దీని వల్ల సంపద సృష్టించుకుని భవిష్యత్తులో సంతోషంగా ఉండవచ్చు.
- ఓపిక చాలా ముఖ్యం…
పతంగులు ఎగరవేసే రోజు గాలి సరిగా లేనప్పటికీ... గాలిపటం ఎగిరేంత వరకు ప్రయత్నిస్తాం. అంటే విజయం వచ్చే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటాం అన్నమాట. పెట్టుబడుల్లో కూడా అనుకున్న ఫలితం రాని పక్షంలో పెట్టుబడి ఉపసంహరణ చేసే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడిదారుల ఓపికకు పరీక్ష ఎదురవుతుంది. పెట్టుబడి ఫలితాలు పొందాలంటే వేచి చూడాల్సి ఉంటుంది.
- రక్షణ
పతంగులను ఎగురవేసే సమయంలో కళ్లకు సమస్య ఉండకుండా కళ్లజోడు, ఇతర రకాల హాని కలగకుండా రక్షణ ఏర్పాట్లు చేసుకుంటాం. ఇదే తీరులో మన పెట్టుబడుల్లో అవాంఛిత సమయాల్లో కాపాడేందుకు వీలుగా బీమా ఉండాలి. అంతేకాకుండా ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా కావాల్సిన మేర రిస్కు తక్కువున్న పెట్టుబడులు ఉండాలి.
- దీర్ఘకాలిక దృష్టి
పతంగి ఎగరవేసేందుకు రోజు మొత్తం ప్రయత్నాలు చేస్తాం. ఒక పతంగి పడిపోయిందని ఆగిపోకుండా మళ్లీ ప్రయత్నిస్తాం. ఇలా చేయటం వల్లనే మిగతా వారందరినీ దాటి ముందుకు వెళ్తారు. అన్ని పతంగులు ఆకాశాన్ని చేరుకోలేవు. కొన్ని మధ్యలోనే తెగిపోతాయి. పతంగి ఆకాశానికి చేరుకున్నప్పుడే ఆనందాన్ని ఇస్తుంది. అలాగే సంపద సృష్టించుకోవాలనుకుంటే కొన్ని సార్లు నష్టాన్ని కూడా చవిచూడాల్సి ఉంటుంది. కష్టనష్టాలకు ఓర్చుకుంటూ... దీర్ఘకాలం పెట్టుబడులను పెట్టినట్లైతే లాభాలను గడించవచ్చు.
ఇదీ చదవండి: కదిలిన పదోన్నతుల దస్త్రం