- కొవిడ్‌తో తలెత్తిన ఆర్థిక సంక్షోభం దేశంలోని వివిధ వర్గాలు, దేశాల మధ్య ప్రభావం చూపింది. కొన్ని దేశాలపై ఎక్కువ పడింది. వ్యక్తులు, కుటుంబాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దిగువ మధ్య తరగతి, పేదల మీద చూపిన ప్రభావం అంచనాలకు అందడం లేదు. దాన్నుంచి వాళ్లు ఎప్పుడు బయట పడతారనేది అగమ్యగోచరమే.
- ప్రభుత్వాలు ఖర్చు చేసేటప్పుడు తక్షణ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొనే కాకుండా మధ్య, దీర్ఘకాలంలో పెట్టుబడి-వృద్ధి, ఉపాధి అవకాశాలను పునరుద్ధరించడం.. ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు, నిరుద్యోగ బీమా లాంటివి ఎంత కాలం అవసరమైతే అంతకాలం కొనసాగించాలి.
-ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జయతీఘోష్‌ఎం.ఎల్.నరసింహారెడ్డి
కరోనా వల్ల ప్రపంచంలో 13.1 కోట్ల మంది కొత్తగా పేదరికంలోకి వెళ్లారు. పేదరికాన్ని తగ్గించేందుకు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ప్రయత్నాలను ఇది వెనక్కు నెట్టింది. అన్ని ప్రాంతాల్లోనూ కొవిడ్‌ను కట్టడి చేసేవరకు ప్రపంచానికి దీని నుంచి విముక్తి ఉండదు. కొత్త మ్యుటేషన్లు వస్తున్నాయి. ఎక్కడైతే ఈ వైరస్ నియంత్రణలోకి రాదో అక్కడ కొత్త మ్యుటేషన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వ్యాక్సిన్ విషయంలో వచ్చే కొన్ని నెలల్లో ఏం జరుగుతుందన్నది కీలకం కానుంది. మహమ్మారి వల్ల తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు ప్రజల కోసం వ్యయ బడ్జెట్లను భారీగా పెంచాల్సిన అవసరం ఏర్పడింది.
జనవరి 18న డబ్ల్యూటీవో డైరెక్టర్ జనరల్ ప్రకటన ప్రకారం 49 ధనిక దేశాలు 39 మిలియన్ డోసుల వ్యాక్సిన్‌ను ఆర్డర్ చేస్తే, తక్కువ ఆదాయం గల ఒక దేశం 25 డోసులు ఆర్డర్ చేసింది. 25 మిలియన్లు, 25 వేలు కాదు.. కేవలం 25 మాత్రమే. ఈ నివేదిక రాసే సమయానికి 130 దేశాల్లో ఒక సింగిల్ డోసు కూడా వేయలేదు. - ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జయతీఘోష్
ప్రపంచంలో ఉన్న ఆర్థిక అసమానతలు కరోనాతో తీవ్రరూపం దాల్చాయి. చివరకు కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీలో కూడా అసమానతలు అధికమయ్యాయి. కొన్ని దేశాలు తమ జనాభా కంటే నాలుగు నుంచి పది రెట్లు ఎక్కువగా వ్యాక్సిన్ సరఫరాకు ఒప్పందాలు చేసుకొంటే 130 దేశాలకు ఇప్పటివరకు ఒక్కటి కూడా లేదు. ఇదే రీతిలో కొనసాగితే 2024 వరకు కూడా ఈ దేశాల్లో టీకాల ప్రక్రియ పూర్తి కాదు. ఈ ప్రభావం అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ప్రభావం చూపుతుందని ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ జయతీఘోష్ అభిప్రాయపడ్డారు.
ఆర్థిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత జోసెఫ్ స్టిగ్లిట్జ్, అమెరికాలోని మసాచుసెట్స్ అమ్‌హెరెస్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జయతీఘోష్‌లు కొవిడ్‌తో ఆర్థిక సంక్షోభం-అంతర్జాతీయంగా అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన నివేదిక ఈ నెల 11న విడుదలైంది. న్యూయార్క్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ న్యూ ఎకనమిక్ థింకింగ్ ఆధ్వర్యంలº ఈ నివేదికను రూపొందించారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం.. అలాగే దీర్ఘకాలంలో ఎదురయ్యే సామాజిక, ఆర్థిక సమస్యలపై తీసుకోవాల్సిన చర్యల గురించి యునైటెడ్ నేషన్స్ 20 మంది ప్రముఖ ఆర్థికవేత్తలతో నియమించిన ఉన్నతస్థాయి కమిటీలో కూడా జయతీఘోష్ సభ్యురాలు. నివేదికలోని ముఖ్యాంశాలు, ప్రస్తుత పరిస్థితిని ఆమె ‘ఈనాడు-ఈటీవీ భారత్’ ముఖాముఖిలో వివరించారు.
ఈ అసమానతలు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
గత సంవత్సరం వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వాలు, ఫార్మా కంపెనీల మధ్య 44 ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ ధనిక దేశాలతోనే. ఈ ఏడాది ఇప్పటికే 12 ఒప్పందాలు జరిగాయి. ప్రస్తుత పంపిణీ ఇలానే జరిగితే కొన్ని పేద దేశాల్లోని ప్రజలకు 2024 వరకు కూడా వ్యాక్సిన్ అందదు. ఇదే తలెత్తితే ప్రపంచంలో వైరస్ మ్యుటేషన్లు పెరిగి కరోనాను నియంత్రించే అవకాశాలు తగ్గుతాయి. ఇది ధనిక దేశాలపై కూడా ప్రభావం చూపుతుంది.
దేశాల మధ్య వ్యాక్సిన్ సమతుల్యతకు ఏం చేయాలి?
కొవిడ్-19 వ్యాక్సిన్, అనుబంధ చికిత్సకు సంబంధించిన పేటెంట్లను రద్దు చేసే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన ప్రయత్నాలను అభివృద్ధి చెందిన దేశాలు అడ్డుకున్నాయి. ఇలా చేయడం ఆశ్చర్యకరం. పేటెంట్ల రద్దు అన్ని దేశాల్లోని ప్రజలకు ఉపయుక్తంగా ఉండేది. పెద్దఎత్తున టీకాలు ఉత్పత్తి చేయడం వల్ల ప్రభుత్వాలకు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు కూడా తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చేవి.
ఇందుకున్న ప్రతిబంధకాలు ఏమిటి?
వాణిజ్య అనుబంధ మేధో హక్కులకు సంబంధించి ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) ఒప్పందం ప్రకారం తప్పనిసరిగా లైసెన్సు కావాలి. అయితే దోహా డిక్లరేషన్ ప్రకారం ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడినపుడు ఇతర కంపెనీలు కూడా అత్యవసర మందులను తయారు చేయవచ్చు. కరోనా నేపథ్యంలో ఇలాంటి లైసెన్సులు జారీ చేస్తున్నట్లు చిలీ, ఇజ్రాయెల్ తదితర దేశాలు ప్రకటించాయి కూడా. అయితే సాంకేతికత బదిలీ అనే అంశం అలాగే పెండింగ్‌లో ఉండిపోయింది. తాము సొంతంగా లైసెన్సులు జారీ చేస్తే తలెత్తే పర్యవసానాల గురించి ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, మేధోపర హక్కుల కోసం చేసిన వ్యయానికి సంబంధించిన రక్షణ.. ఇలా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మేధోపర హక్కుల రద్దుపై కానీ, ఇందులో మార్పులపై కానీ ప్రపంచదేశాలన్నీ కలిసి నిర్ణయం తీసుకోవాలి. దీనిపై ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ఎనిమిది సమావేశాలు జరిగాయి. నిర్ణయం మాత్రం జరగలేదు.
ఈ పరిస్థితులను అధిగమించడం ఎలా?
ఇటువంటి పరిస్థితుల్లో స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్‌డీఆర్) రూపంలో నగదు లభ్యతను పెంపొందించటానికి అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఇంటర్నేషనల్ మోనిటరీ ఫండ్- ఐఎంఎఫ్) చర్యలు తీసుకోవాలి. మొదటిసారిగా గత ఏడాది మార్చిలో ఈ ప్రతిపాదన వచ్చింది. కానీ దానిపై వెంటనే స్పందించలేదు. ప్రస్తుతం చట్టసభల అనుమతి కోరకుండా 655 బిలియన్ డాలర్ల ఎస్‌డీఆర్‌లను జారీ చేయవచ్చు. అలా చేస్తే ద్రవ్యోల్బణం పెరిగిపోతుందనే భయాలు గతంలో ఉండేవి. కానీ ప్రస్తుత ప్రపంచ ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటే... ముఖ్యంగా ధనిక దేశాల్లో నగదు విస్తరణను గమనిస్తే అటువంటి భయాలు అర్థరహితమని తెలుస్తోంది.
టీకాల పంపిణీ కూడా అసమానతల తీవ్రతను తెలియజేస్తుందంటారా?
కచ్చితంగా. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్లు, ఇతర మందులు అందుబాటులో ఉండటం అన్నది చాలా ముఖ్యం. ఇందులో తీవ్రమైన అసమానతలు ఉన్నాయి. తక్కువ కాలంలో కొవిడ్ టీకాలు ఉత్పత్తి చేయడం గొప్ప విషయం. అయితే ప్రస్తుతం ఉత్పత్తి, పంపిణీ విధానాన్ని చూస్తే అంతర్జాతీయంగా తీవ్రమైన అసమానతలు కనిపిస్తున్నాయి. కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు మొత్తం వ్యాక్సిన్లను తీసేసుకొన్నాయి. ఇది సరైంది కాదు. జనాభాకంటే నాలుగు నుంచి పది రెట్ల సరఫరాకు ఒప్పందాలు చేసుకొన్నాయి. కెనడా తమ దేశ జనాభా కంటే పది రెట్లు ఎక్కువగా టీకాను ఆర్డర్ చేసింది. ఇలా చేస్తే పేద దేశాలకు అందుబాటులో ఉండదు.
ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి దేశాలు ఎలా ముందుకెళ్లాలి?
ఎక్కువ దేశాలు ఆర్థికంగా పురోభివృద్ధి బాట పట్టకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడదు. అంతర్జాతీయంగా వృద్ధి ప్రస్తుతం ఆగిపోయి ఉంది. కొన్ని దేశాలు వృద్ధిరేటు పెరిగేలా విధానాలు తీసుకొని తమ ఉత్పత్తి నిల్వలు పెంచాయి. అయితే అంతర్జాతీయంగా పరిస్థితులు దీనికి అనుగుణంగా లేవు. ఈ నేపథ్యంలో తక్షణం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై మా నివేదిక పలు కీలక సిఫార్సులు చేసింది. కరోనాను అదుపులోకి తెస్తేనే ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణ ప్రారంభమవుతుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పుడిప్పుడే మార్కెట్ వ్యవస్థను పటిష్ఠం చేసుకొంటున్న దేశాలకు అండగా నిలవాలి.
స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ప్రయోజనాలు ఎలా ఉంటాయి?
దీనివల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలకు నగదు లభ్యత పెరిగి ఉపాధికల్పన కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టగలుగుతాయి. అధిక అప్పుల భారం ఉన్న దేశాలు ఈ సొమ్ముతో కొంతమేరకు తమ అప్పులు తగ్గించుకుంటాయి. కొన్ని దేశాలు ఎటూ ఎస్‌డీఆర్‌లోని తమ కోటాను ఉపయోగించుకోవు. ఆ కోటాను అధిక అవసరాలు ఉన్న ఇతర దేశాలకు మళ్లించవచ్చు. పేద దేశాల అప్పుల్ని రద్దు చేయటం, నేరుగా అప్పులు ఇవ్వటం, ప్రపంచ సాంఘిక భద్రతా నిధికి ఇవ్వటం.. వంటి వివిధ మార్గాల్లో ఈ కేటాయింపులు చేయవచ్చు. ఎస్‌డీఆర్‌ను నిరంతరం జారీ చేసేందుకు అవసరమైన సంస్థాగత ఏర్పాట్లు చేసే విషయమై మా కమిషన్ ఇచ్చే తదుపరి నివేదికలో చర్చించదలిచాం.