Etela rajender on mlc elections: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు ఏకగ్రీవం అవకాశం ఇవ్వొద్దని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(etela chit chat with media) విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లో ఒక స్థానంలో తెరాస ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఈటల, విజయశాంతి.. సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆదిలాబాద్ నుంచి తానే ఒకరిని పోటీకి దింపినట్లు ఈటల తెలిపారు. ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయి.. గెలుస్తామా, ఓడుతామా అనేది పక్కన పెడితే పోటీ చేయాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేస్తే కేసీఆర్‌కు కనీసం భయమైనా ఉండేదని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్‌పై నమ్మకం పోయింది
ముఖ్యమంత్రి పీఠం కోసం కేసీఆర్ కుటుంబంలో యుద్ధం మొదలైందని మాజీ ఎంపీ, భాజపా నేత విజయశాంతి(vijayashanthi chit chat with media) అన్నారు. ప్రగతి భవన్లో కుస్తీ ఫైటింగ్ జరుగుతోందన్న ఆమె.. కుటుంబ పంచాయితీతో కేసీఆర్ తల పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో భవిష్యత్తులో తెరాస ఉండదని జోస్యం చెప్పారు. కేసీఆర్ మోసపూరిత విధానాలు అవలంభిస్తున్నారని.. ఆయన మాటలను ఎవరూ నమ్మడం లేదని చిట్‌చాట్‌లో విజయశాంతి అన్నారు.
వాళ్లు టచ్‌లో ఉన్నారు
కుటుంబ కొట్లాటల నుంచి ఉపశమనం పొందేందుకే కేసీఆర్ దిల్లీ పర్యటనకు వెళ్లారని విజయశాంతి(vijaya shanthi comments on kcr) ఎద్దేవా చేశారు. కేసీఆర్ గురించి పీహెచ్డీ చేశానన్న ఆమె.. ఆయన ప్రజలకు ఏం చెప్తారో అదే చేయరని విమర్శించారు. తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం మూడూ ఒకటేనని.. అవసరాల కోసమే కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో తెరాసకు తక్కువ సీట్లు పడితే.. అప్పుడు హస్తం పార్టీ సీట్లు వాడుకుంటారని ఆరోపించారు. తాను ఎక్కడ పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. కేసీఆర్‌పై కచ్చితంగా విచారణ ఉంటుందన్న ఆమె.. ఇతర పార్టీలకు చెందిన నేతలు తమకు టచ్‌లో ఉన్నారని చెప్పారు.
ఇదీ చదవండి: BJP Tarun chugh comments: 'కాంగ్రెస్, తెరాస నుంచి పాతికమంది నేతలు టచ్‌లో ఉన్నారు'