Etala Rajender fire on kcr: కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేంద్రాన్ని దూషించేస్థాయికి దిగజారారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. సీఎం పదే పదే ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. కేసీఆర్ మంచి జరిగితే తన ఖాతాలో చెడు జరిగితే ఇతరులపై నెట్టివేస్తారని ఘాటుగా విమర్శించారు.
అబద్దాలు, తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేయడం మంచిదికాదన్నారు. కేంద్రం వసూలు చేసిన పన్నుల్లో 14శాతం రాష్ట్రాలకు పంచుతుందని ఈటల తెలిపారు. రాష్ట్రాల పారా మీటర్ ఆధారంగా బడ్జెట్ కేటాయించుతుంది తప్పితే.. భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఒక విధంగా లేని చోట మరో విధంగా కేటాయించదని స్పష్టం చేశారు. బడ్జెట్ పేపర్‌లో ఎక్కువ పెట్టుకుని కేంద్రం తక్కువ ఇస్తోందని బద్నాం చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ తెలంగాణాను అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. డబ్బులు పంచే ప్రభుత్వం గొప్పది కాదని.. ఉపాధి సంక్షేమ పథకాలు కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద మేము బతకడం లేదు.. కేంద్రమే మాపై ఆధారపడి బతుకుతుందని చెప్పడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని దమ్ముంటే తెచ్చిన అప్పు, ఖర్చు, కేటాయింపులు, జీఓలను వెబ్ సైట్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
"అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేంద్రాన్ని దూషించే స్థాయికి కేసీఆర్ దిగజారారు. డబ్బులు పంచే ప్రభుత్వం గొప్పది కాదు. ఉపాధి సంక్షేమ పథకాలు కల్పించాలి. ఆర్థిక మంత్రి హరీష్‌రావుతో బహిరంగ చర్చకు సిద్దం. అబద్ధాలు, తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేయడం మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వం మీద మేము బతకడం లేదు కేంద్రమే మాపై ఆధారపడి బతుకుతుందని చెప్పడం సిగ్గు చేటు" -ఈటల రాజేందర్, హుజురాబాద్ ఎమ్మెల్యే
ఇవీ చదవండి: