Errabelli Dayakar Review on Telangana Haritha haram Goals : కొత్త గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులకు స్పష్టం చేశారు. అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డీపీఓలు, డీఆర్‌డీఓలతో మంత్రి సచివాలయం నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. హరితహారంలో లక్ష్యాలకు అనుగుణంగా గ్రామాల్లో మొక్కలు విరివిగా నాటాలని సూచించారు.
Telangana Haritha haram Goals : దశాబ్ది సంపద వనాలు, హార్టికల్చర్ ప్లాంటేషన్ల పనులలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశించారు. అధికారులు క్షేత్ర పర్యటనలు చేసి, కింది స్థాయి అధికారులు, ఉద్యోగులను అప్రమత్తం చేయాలని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అన్ని గ్రామాలను కడిగిన ముత్యంలా చేశారన్న దయాకర్ రావు.. నూతనంగా నిర్మిస్తున్న 3,622 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
Telangana Haritha haram Goals 2023 : హరితహారంలో భాగంగా పంచాయతీరాజ్ శాఖకు 6కోట్ల 70 లక్షల మొక్కలు నాటే లక్ష్యం ఇవ్వగా, ఇప్పటి వరకు 2కోట్ల 25 లక్షల మొక్కలు నాటినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మిగతా మొక్కలను కూడా త్వరగా నాటాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ భూముల్లో దశాబ్ది సంపద వనాలు ఏర్పాటు చేయాలని, హార్టికల్చర్ ప్లాంటేషన్‌ను 50 వేల చోట్ల చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
పర్యాటక రంగంలో తెలంగాణ అగ్రస్థానం : అంతకు ముందు హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అధ్వర్యంలో దివ్యాంగుల శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ఆతిథ్యం కోసం ఇతర దేశాల పౌరులు పోటీపడే పరిస్థితికి వచ్చిందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక శాఖల నేతృత్వంలో నిథమ్ అధ్వర్యంలో దివ్యాంగుల శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలోనే పర్యాటక రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అన్ని వసతులు సమకూరుస్తున్నారని మంత్రి తెలిపారు.
"రాష్ట్రవ్యాప్తంగా 3,622 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. హరితహారంలో పంచాయతీరాజ్‌శాఖ ద్వారా 4.45 కోట్ల మొక్కలను నాటాలి. ఉపాధి హామీ కింద 50 వేల ఎకరాల్లో పండ్లు, కూరగాయల తోటల పెంపకం చేపట్టాం. వ్యవసాయ భూముల్లో దశాబ్ది సంపద వనాలు ఏర్పాటు చేయాలి"- ఎర్రబెల్లి దయాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ఇవీ చదవండి: