CM Revanth Meets Satya Nadella : రాష్ట్రంలో సాంకేతిక రంగం, వనరుల అభివృద్ధికి సహకరించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో, ఛైర్మన్ సత్య నాదెళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని సత్య నాదెళ్ల ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారితో కలిసి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రణాళికలను సత్య నాదెళ్లకు ముఖ్యమంత్రి వివరించారు.
హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ నూతన ప్రాంగణంలో 4 వేల మంది సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు లభించడం, త్వరలో చందనవెల్లి, మేకగూడ, షాద్ నగర్ లో నాలుగు డేటా సెంటర్లను 600 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనుండటంపై సత్య నాదెళ్లకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏఐ సదస్సులో మైక్రోసాఫ్ట్‌తో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇప్పటి వరకు సుమారు 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ పూర్తయినట్లు ముఖ్యమంత్రి వివరించారు.
తెలంగాణ అభివృద్ధికి మైక్రోసాఫ్ట్ సహకారం అభినందనీయమని రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్లౌడ్ కంప్యూటరింగ్కు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. దీనికి మైక్రోసాఫ్ట్ భాగస్వామిగా ఉండాలని, ప్యూచర్ సిటీలో రానున్న ఏఐ సిటీలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సత్య నాదెళ్లను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఏఐ, జెన్ ఏఐలో శిక్షణ ఇచ్చి అత్యున్నత సాంకేతిక ఉద్యోగాలు లభించేలా తోడ్పాటు అందించాలన్నారు.
సత్యనాదెళ్లకు సీఎం రేవంత్ ధన్యవాదాలు : హైదరాబాద్ సహా తెలంగాణలో ఏర్పాటయ్యే అంకురాలకు ఓపెన్ ఏఐ నుంచి ఉచిత క్రెడిట్స్ ఇచ్చేలా త్వరలో దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం కోరారు. హైదరాబాద్ పాటు తెలంగాణ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు పెంచుతూ పోతున్నందుకు సత్య నాదెళ్లకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
అప్పుడే హైదరాబాద్ ప్రపంచంలో టాప్ 50లో : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని సీఎంకు సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు. నైపుణాభివృద్ది, మెరుగైన మౌలిక వసతులే ఆర్థికాభివృద్ధికి దోహదపడి హైదరాబాద్‌ను ప్రపంచంలోని టాప్ 50 నగరాల్లో ఉంచగలమని సత్యనాదెళ్ల అన్నారు. భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికత అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. సత్య నాదెళ్లకు సీఎం రేవంత్ రెడ్డి శాలువా కప్పి, జ్ఞాపిక ఇచ్చి సన్మానించారు. ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి అజిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రూ. 5,260 కోట్ల పెట్టుబడులు, 12 వేల మందికి ఉద్యోగాలు - ప్రభుత్వంతో 6 ఫార్మా కంపెనీల ఒప్పందం