Errabelli Dayakar Rao Fire On Central Govt: ఉపాధిహామీ పథకం, పంచాయతీలకు నిధుల విడుదలతో కేంద్రప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. హైదరాబాద్లో జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సమావేశమైంది. రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన భేటీలో ఎర్రబెల్లి దయాకరరావుతో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాఠోడ్, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
ఉపాధి హామీ పనుల నిర్వహణ, పురోగతి సంబంధిత అంశాలపై సమావేశంలో చర్చించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానించాలని, మున్సిపాలిటీలలో ఉపాధిహామీ పథకం అవకాశం ఇవ్వాలని తీర్మానం చేశారు. ఉపాధిహామీ పథకం అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. 14కోట్ల పనిదినాలను... పదికోట్లకు తగ్గించారని పేర్కొన్నారు. వివరాలన్నింటినీ సక్రమంగా పంపించినప్పటికీ నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపించారు.
ప్రధాని మోదీ తెలంగాణకు ఏం చేశారు. పెట్రో ధరలు ఎందుకు పెంచారు.. ఎందుకు తగ్గించారు. ఈ సీజన్‌లో ఉపాధి పనిదినాలను కేంద్రం 4 కోట్లు తగ్గించింది. 16 కోట్ల పనిదినాలు ఇవ్వాలని తీర్మానం చేశాం. ఉపాధిహామీని సాగుకు అనుసంధానించాలని మళ్లీ తీర్మానం చేశాం. పట్టణాల్లోనూ ఉపాధిహామీ అమలుచేయాలని తీర్మానం చేశాం. కేంద్రం 3 నెలలుగా ఉపాధిహామీ బిల్లులు ఇవ్వడం లేదు. ఒకట్రెండు నెలలు బిల్లులు ఆలస్యం కావచ్చు, తొందరపడవద్దు. -- ఎర్రబెల్లి దయాకర్రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి