కరోనా వైరస్ వ్యాప్తిలో భాగంగా పదో తరగతి పరీక్షల్లానే.. జేఎన్‌టీయూ, ఉస్మానియా పరిధిలో ఇంజినీరింగ్, డిగ్రీ పరీక్షలు రద్దు చేయాలని భాగ్యనగరంలోని ప్రైవేటు కళాశాలల్లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్ ఉద్యమం చేపట్టారు. నగరంలోని గోకరాజు రంగరాజు కళాశాలలో చదువుతున్న కౌశిక్ అనే విద్యార్థి నేతృత్వంలో విద్యార్థులు హర్ష, నాగసాయి, హరీష్ ఆన్‌లైన్‌లో జేఎన్‌టీయూ, ఓయూ, ఇతర వర్సిటీల పరిధిలోని విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.
వీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియోను 3.35 లక్షల మంది వీక్షించారు. ఆన్‌లైన్‌లో చేపట్టిన సర్వేలో పరీక్షలు రాసేందుకు సిద్ధంగా లేమని విద్యార్థులు స్పష్టం చేశారు. దాదాపు 94 శాతం మంది ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల కోసం ప్రయాణానికి సిద్ధంగా లేమని తెలిపారు. దాదాపు 40శాతం మంది విద్యార్థులు కళాశాల వసతి గృహాల్లోనే ఉండటం వల్ల భౌతిక దూరం సాధ్యం కాదని పేర్కొన్నారు. లాక్‌డౌన్ కంటే ముందు 50శాతం సిలబస్ మాత్రమే పూర్తయ్యిందని, ఆన్‌లైన్ బోధన ప్రభావవంతంగా సాగలేదని అభిప్రాయపడ్డారు.
ఆన్‌లైన్ సర్వే
4,356 పాల్గొన్నవారు
93.8% పరీక్షలు వద్దన్నవారు