హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా పాజిటివ్ బాధితుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. ప్రతి రోజు రెండు విడతలు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కరోనా కంట్రోల్ రూం నుంచి వారి ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నామని వెల్లడించారు. ఎమర్జెన్సీ పేషంట్‌ను మాత్రమే ఆస్పత్రికి తరలించేందుకు ప్రభుత్వం హోం ఐసోలేషన్ ఏర్పాటు చేసిందన్నారు.
ప్రస్తుతం నగరంలో 2192 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు లోకేశ్‌కుమార్ తెలిపారు. కరోనా కట్టడి అమలులో జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్య, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంచిన వ్యక్తుల ఇంటిని మాత్రమే కంటైన్మెంట్ చేస్తున్నందున... బయటి వ్యక్తులకు ఏమాత్రం తెలియదన్నారు. గతంలో లాగా బారికేడింగ్ చేసినట్లైతే వాటిని తొలగించేందుకు ఆలస్యమవుతుందని.. తద్వారా సత్వర వైద్య సేవలు అందించటంలో జాప్యం జరుగుతుందన్నారు. నిన్న ఐసోలేషన్‌లో ఉన్న 17 మందికి అత్యవసర వైద్య సేవలు అవసరమని గుర్తించి ఆస్పత్రులకు తరలించినట్లు పేర్కొన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి ఎమర్జెన్సీ కాల్ నెంబర్‌ను కూడా ఇస్తున్నట్లు వివరించారు.