Govt gives permission for new medical colleges In Telangana : పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యంగా జిల్లాకో వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని భావించిన సర్కారు.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తుండగా.. తాజాగా 8 వైద్య కళాశాలలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కి చేరనుంది. తాజా ఆదేశాలతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పది వేలకు చేరువుతుండటం గమనార్హం.
రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో కేవలం 5 వైద్య కళాశాలలు అందుబాటులో ఉండగా 9 ఏళ్లలో జిల్లాకో మెడికల్ కాలేజీ కల సాకారం దిశగా తెలంగాణ సర్కారు ముందుకు సాగుతుండటం విశేషం. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రానున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఆయా వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ నుంచి అనుమతులు జారీ అయితే వచ్చే విద్యా సంవత్సరానికి జిల్లాకో వైద్య కళాశాల కల సాకారం అవుతుందని సర్కారు పేర్కొంది.
తాజాగా అనుమతించిన 8 కళాశాలల్లో ఒక్కో దానిలో 100 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున మొత్తం 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పది వేలకు చేరువకానుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ మెడికల్ కాలేజీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. 2016వ సంవత్సరంలో మహబూబ్ నగర్, సిద్దిపేటల్లో కళాశాలలు ఏర్పాటు చేసిన సర్కారు.. 2018-19 సంవత్సరంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చింది.
- పత్రాలలో ఘనం.. నిధుల విడుదలలో శూన్యం.. బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణం
- Harish Rao on Telangana MBBS seats : 'వైద్యసీట్ల పెంపులో తెలంగాణ మరో మైలురాయిని అందుకుంది'
New Medical Colleges list in Telangana : 2022-23 ఏడాదిలో మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి కలిపి మొత్తం 8, 2023-24 సంవత్సరానికి గాను కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయంశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామలలో అంటే 9 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. ఇక వచ్చే ఏడాది మరో 8 కాలేజీలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 34కి చేరనుంది. అయితే అందులో 29 కళాశాలలను తెలంగాణ ఏర్పడిన తర్వాత అనుమతించటం గమనార్హం.
జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యంగా తెలంగాణ సర్కారు చేపట్టిన చర్యలతో 2014 నాటికి ప్రభుత్వ విభాగంలో కేవలం 850 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా ఇప్పుడా సంఖ్య 4590కి పెరిగింది. ఇక ప్రైవేటు కళాశాలల్లో సిట్లను కలిపితే.. ఎంబీబీఎస్ సీట్లసంఖ్య ఏకంగా 9140కి చేరుతునట్టు సర్కారు తెలిపింది. ఇప్పటికే ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీబీఎస్ సీట్లతో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో, 7.5 పీజీ సీట్లతో రెండో స్థానంలో నిలిచిందని స్పష్టం చేసింది.
ఓ వైపు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటుతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచిన సర్కారు.. తెలంగాణ విద్యార్థులకు మరిన్ని సీట్లను అందించేందుకు తాజాగా ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. 2014 తర్వాత ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని 100 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే కేటాయించాలని నిర్ణయించింది. ఇక వైద్య కళాశాలల పెంపుపై మంత్రి హరీశ్ రావు సైతం హర్షం వ్యక్తం చేశారు కేవలం 9 ఏళ్లలో 29 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయటం సీఎం కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: