నమ్మిన సిద్ధాంత కోసం చివరి వరకు పోరాటం చేసిన గొప్ప యోధురాలు, సాహసి, ధైర్యవంతురాలు ఈశ్వరీబాయి అని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. రాజకీయ నిబద్ధత కలిగిన ఈశ్వరీబాయి ప్రజా జీవన ప్రస్థానం నేటితరం యువతకు స్ఫూర్తి కావాలని పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆమె 30వ వర్ధంతి సభను నిర్వహించారు.
పుస్తకావిష్కరణ
ఈశ్వరీబాయి జీవిత విశేషాలతో ప్రముఖ రచయిత ఎంఎల్ నరసింహారావు రాసిన 'ఈశ్వరీబాయి జీవితం, ఉద్యమం, శాసనసభ ప్రసంగాలు' అనే పుస్తకాన్ని రమణాచారి ఆవిష్కరించారు. దళిత అభ్యున్నతి కోసం కృషి చేస్తోన్న మాజీ ఐఆర్‌ఎస్ అధికారి ప్రీతిహరీత్‌కు ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ కోసం పోరాటం చేసిన ధీరశాలి ఈశ్వరీబాయి అని పలువురు వక్తలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ అకాడమీ సంచాలకులు సుధారాణి, ఐఏఎస్ అధికారి విజేంద్రబోయి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మార్చి 1 నుంచి మూడోదశ కరోనా టీకాల పంపిణీ