జీడిమెట్లలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ... ఏ మాత్రం ఉపయోగపడకుండా ఉన్నాయని గత నెల 23న ఈనాడు కథనాన్ని ప్రచురించింది. రసానియక వ్యర్థాలను యథాతథంగా బయటకు విడుదల చేస్తుండటం వల్ల పరిసర భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన ఖనిజాలు ఉన్నట్లు పీసీబీ పరిశీలనలో తేలిందని కథనంలో వివరించింది. స్పందించిన హైకోర్టు రిజిస్ట్రార్ ఈనాడు కథనాన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తిని కోరారు. భూగర్భ జలాల్లో కాలుష్యం కలవకుండా చర్యలకు ఆదేశించాలని కోరారు.
సుమోటోగా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు పరిగణనలోకి తీసుకొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక, పర్యావరణ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులతో పాటు... పరిశ్రమల శాఖ సంచాలకుడు, జీహెచ్ఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి, మేడ్చల్ కలెక్టర్‌ను ప్రతివాదులుగా చేర్చింది. వ్యాజ్యంపై ఈనెల 6న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
ఇవీచూడండి: నగరం నిద్రపోయే వేళ కనిపించే జీవన వైవిధ్యం...