రాష్ట్రవ్యాప్తంగా విద్యా వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు. పాఠశాలల్లో పనిచేస్తున్న 13 వేల మందిని రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వారికి మద్దతుగా పీఆర్టీయూ ఎమ్మెల్సీ ఆందోళనలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పని సమాన వేతనం ఇవ్వకుండా తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
విద్యా వాలంటీర్లకు రూ.12 వేలు జీతం ఇస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2019-20 విద్యా సంవత్సరంలో నాలుగు నెలల పెండింగ్ జీతాలతో పాటు.. కరోనా సమయంలో కూడా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తక్కువ జీతానికే రెగ్యులర్ ఉపాధ్యాయుల డ్యూటీలు చేస్తున్న తమను రెన్యువల్ చేయకుండా ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందన్నారు. తగిన వేతనంతో విద్యా వాలంటీర్లను కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.