ED Questioning Puri Jagannath And Charmy: వరుస విచారణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేడి పుట్టిస్తోంది. ఒకవైపు జూదం మాటున నిధుల మళ్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వరసబెట్టి ప్రశ్నిస్తున్న అధికారులు.. మరోవైపు విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘లైగర్’ సినిమా లావాదేవీలకు సంబంధించి సినీ ప్రముఖులు పూరి జగన్నాథ్, ఛార్మిలను కూడా విచారణకు పిలిపించారు. ఈ రెండు కేసుల విచారణ మరికొన్ని రోజులపాటు జరిగే అవకాశం ఉంది. దాంతో ఈడీ కార్యాలయంలో హడావుడి కనిపిస్తోంది. విదేశాల్లోని క్యాసినోల్లో జూదం ఆడే క్రమంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందన్న అనుమానంపై గత నాలుగు నెలలుగా ఈడీ అధికారులు దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్, ప్రభాకర్‌రెడ్డిలతోపాటు వారితో సంబంధం ఉన్న వారందర్నీ పిలిచి విచారిస్తున్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని పిలిపించారు. ఉదయం పది గంటల సమయంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న ఆయనను రాత్రి 9 గంటల వరకు విచారించారు. చీకోటి ప్రవీణ్ వ్యాపార లావాదేవీలను పరిశీలించినప్పుడు గుర్నాథరెడ్డి నుంచి నిధుల బదిలీ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారని, దీన్ని నివృత్తి చేసుకునేందుకే ఆయనను విచారించినట్లు తెలుస్తోంది. విదేశాల్లో జూదం ఆడేందుకు ఇక్కడే టోకెన్లు కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఒకవేళ డబ్బు గెలుచుకుంటే అక్కడ కూడా టోకెన్లు ఇచ్చేవారని, స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత నిర్వాహకులు వాటి విలువకు తగ్గ డబ్బు అందజేసేవారని తెలుస్తోంది. ఈ చెల్లింపులు ఒక విధంగా హవాలా తరహాలోనే జరుగుతాయి. దాంతో ఎన్నిసార్లు విదేశాలకు వెళ్లారు, ఎంత డబ్బు గెలుచుకున్నారు తదితర విషయాలను ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. గుర్నాథరెడ్డిని కూడా దీనికి సంబంధించే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఏపీకి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు యుగంధర్‌ను కూడా పిలిపించి విచారించారు. హైదరాబాద్‌లో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్న యుగంధర్‌కు కూడా విదేశీ జూదంతో సంబంధాలు ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. తెరాస ఎమ్మెల్సీ ఎల్.రమణను శుక్రవారం ఈడీ కార్యాలయానికి రమ్మన్నట్లు తెలుస్తోంది. ఆయనతోపాటు ఇంకొందర్ని కూడా విచారించనున్నారని సమాచారం.
మైక్ టైసన్‌కు పారితోషికంపై..‘లైగర్’ సినిమాలో పెట్టుబడులకు సంబంధించి విచారించేందుకు ఆ చిత్ర నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మిలను కూడా గురువారం ఈడీ కార్యాలయానికి పిలిపించారు. 15 రోజుల క్రితమే వీరిద్దరికీ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అమెరికాకు చెందిన ప్రపంచ బాక్సింగ్ మాజీ ఛాంపియన్ మైక్ టైసన్ నటించారు. ఆయన పారితోషికానికి సంబంధించిన చెల్లింపులతోపాటు.. ఈ సినిమాలో పెట్టుబడులపై ఆరా తీసేందుకు ఇద్దర్నీ పిలిపించినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వీరు ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. ‘లైగర్’ సినిమా పెట్టుబడుల్లో అనుమానాస్పద లావాదేవీలున్నాయంటూ కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ ఇటీవల ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాజా పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. టాలీవుడ్ మత్తుమందుల కేసులో గతంలోనూ పూరి జగన్నాథ్, ఛార్మిలను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి: క్యాసినో వ్యవహారం కేసు.. ఈడీ ముందుకు మాజీ ఎమ్మెల్యే
కలెక్టర్ మంచి మనస్సు.. పార్కుల్లో చదువుకునే వారి కోసం ఏసీ స్టడీ సెంటర్