EC Arrangements Telangana Election Counting : శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 49 ప్రాంతాల్లో ఓట్లు లెక్కించేందుకు.. ఎన్నికల సంఘం (Election Commission) విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో నాలుగు, నిజామాబాద్ జిల్లాలో రెండు ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఒకే చోట కేంద్రం ఉండగా.. మిగిలిన 28 జిల్లాల్లో ఒకటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి.
Telangana Assembly Elections Results 2023 : ప్రతి నియోజకవర్గంలో లెక్కింపు కోసం 14 చొప్పున టేబుళ్లు.. పోస్టల్ బ్యాలెట్ కోసం అదనంగా మరో టేబుల్ ఏర్పాటు చేస్తారు. మొత్తం ఈవీఎంల లెక్కింపు కోసం 1766 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం 131 టేబుళ్లు ఉంటాయి. తొలుత ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అరగంట తర్వాత ఎనిమిదిన్నరకు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుంది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల చేసిన ఇండియా టుడే - ఏ పార్టీకి పట్టం కట్టిందంటే?
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు : హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు సహా ..రాష్ట్రంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద (Counting centers in Telangana) 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. కేంద్రాల సమీపంలో ఎలాంటి ఊరేగింపులు చేయవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Telangana Assembly Elections Counting Arrangements 2023 : కర్రలు, జెండాలు, తుపాకులు వంటి ఆయుధాలతో సంచరించడం నిషేధమని.. పోలీసులు తెలిపారు. పాటలు పాడటం, స్పీకర్లు వినియోగించడం వంటివి చేయకూడదని హెచ్చరించారు. ప్లకార్డులు, ఇతర గుర్తులు, ఫొటోలు ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో టెంట్లు, షామియానాలు వేయకూడదని పేర్కొన్నారు. మైకుల ద్వారా ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఈ ఆంక్షలు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి.. సోమవారం ఉదయం 6 గంటలు వరకూ అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత : కీసరలోని హోలీ మేరీ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని.. మేడ్చల్ కలెక్టర్ గౌతమ్‌తో కలిసి రాచకొండ సీపీ చౌహాన్ (Rachakonda CP Chauhan) పరిశీలించారు. లెక్కింపు సమయంలో ఎలాంటి ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు. సంగారెడ్డి, పటాన్‌చెరు, ఆందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు (Telangana Election Counting) నిర్వహించే.. గీతం విశ్వవిద్యాలయం వద్ద మూడంచెల భద్రత కల్పించారు.
తెలంగాణలో ఛాలెంజ్ ఓటు వేసిన ఒక్కమగాడు - ఎక్కడో తెలుసా?
Telangana Assembly Elections 2023 : నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్.. ఈవీఎంల భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అన్ని సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జనగామ జిల్లా పాలకుర్తి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు.. పెంబర్తి విద్యాభారతి ఇంజనీరింగ్ కళాశాలలో చేపట్టనున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్, మహబూబాబాద్‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు సాంఘిక సంక్షేమ పాఠశాలలో జరపనున్నారు. భూపాలపల్లికి సంబంధించి అంబేడ్కర్ స్టేడియంలో, ములుగు ఓట్ల లెక్కింపు.. అక్కడి కలెక్టరేట్ మినీ మీటింగ్ హాల్‌లో చేపట్టనున్నారు.
ఉదయం పదిన్నరకే తొలి ఆధిక్యం తెలిసే అవకాశం : హనుమకొండ జిల్లాలో పరకాల, వరంగల్ పశ్చిమ, నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్దన్నపేట నియోజకవర్గాలకు సంబంధించి.. ఓట్ల లెక్కింపును ఎనుమాముల మార్కెట్ గోదాముల్లో చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. లెక్కింపు కేంద్రంలో ప్రతి టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్, కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. తక్కువ మంది అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాల్లో ఉదయం పదిన్నరకే తొలి ఆధిక్యం తెలిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో 71.34 శాతం పోలింగ్ నమోదు - మునుగోడులో అత్యధికం, హైదరాబాద్‌లో అత్యల్పం