Reading Tips for Students: అంతగా ఆసక్తి లేని పని మొదలుపెట్టాలంటే.. మనసు ఒక పట్టాన ఒప్పుకోదు. నచ్చని సబ్జెక్టుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. ఇలాంటప్పుడే ‘5 మినిట్ రూల్’ని అమలుచేయాలంటున్నారు నిపుణులు. దీంట్లో భాగంగా ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టి ఐదు నిమిషాలపాటు మాత్రమే చేయాలి. సరిగ్గా 5 నిమిషాలకు అలారం పెట్టుకుని.. కాస్త కఠినంగా ఉండే సబ్జెక్టును చదవడం మొదలుపెట్టాలి.
సమయం ముగిసినా.. ఆ సబ్జెక్టును ఇంకా చదవాలనిపిస్తే మరో పావుగంటపాటు కొనసాగించొచ్చు. తర్వాత ఆ సబ్జెక్టును పక్కన పెట్టేయాలి. మరో ఐదు నిమిషాలు అలారం పెట్టుకుని కొత్త సబ్జెక్టును చదవాలి. ఇలా చేయడం వల్ల చదవడాన్ని వాయిదా వేయకుండా ఉండగలుగుతారు. ఏ సబ్జెక్టు చదవాలని అనిపిస్తుందో.. దాన్ని ఆసక్తిగా కొనసాగించగలుగుతారు.
ఒకే సబ్జెక్టు వద్దు: ఒకే సబ్జెక్టును గంటలకొద్దీ చదువుతూ ఉండకూడదు. ప్రతి అరగంటకు ఒకసారైనా కాస్త విరామం తీసుకోవాలి. ఆ సమయంలో ఒకేచోట కూర్చుని ఉండకుండా.. కాస్త అటూఇటూ నడవాలి. ఇలాచేయడం వల్ల బద్ధకం వదిలి చురుకుదనం పెరుగుతుంది. ఇలా ఒక్కో సబ్జెక్టుకూ తక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల విసుగు అనిపించదు.
చాలా రకాలుగా: సాధారణంగా తరగతి పుస్తకంలోని పాఠ్యాంశాలనే చదువుతుంటాం కదా. అలాకాకుండా మరో విధానమూ ప్రయత్నించాలి. ఆ పాఠానికి సంబంధించిన ఆడియో వినొచ్చు లేదా యూట్యూబ్‌లో వీడియో చూడొచ్చు. పాత ప్రశ్నపత్రాలనూ పూర్తిచేయొచ్చు. ఆ పాఠంలోని ముఖ్యాంశాలను ప్రశ్నించమని స్నేహితులను అడగొచ్చు. మీరూ వాళ్లకు కొన్ని ప్రశ్నలు వేయొచ్చు. ఇలా ఒకరినొకరు ప్రశ్నించుకోవడం ఆసక్తిగా ఉంటుంది. అంతేకాదు, సరైన సమాధానాలు చెప్పాలనే పోటీ మీ మధ్య పెరుగుతుంది కూడా. అలాగే గణాంకేలేమైనా ఉంటే ఫ్లాష్ కార్డులనూ తయారుచేసుకుని వాడుకోవచ్చు. ఇలా వివిధ పద్ధతుల్లో పాఠ్యాంశాలను చదివితే ఆసక్తిగా ఉంటుంది. త్వరగా మర్చిపోలేరు కూడా.
చదువుకునే ప్రదేశం: చదువుకునే చోటు ప్రశాంతంగా.. గాలీ, వెలుతురూ వచ్చేలా ఉండాలి. ఎలాంటి అవాంతరాలూ లేకుండా చూసుకుంటే దృష్టి అనవసర విషయాల మీదకు మళ్లదు. చదవడానికి సంబంధించిన సామగ్రి అంతటినీ ఒకేచోట అందుబాటులో పెట్టుకోవాలి. ఎక్కో వస్తువు కోసం ఒక్కోసారి లేచి వెళితే ఏకాగ్రత లోపిస్తుంది.
విరామం అవసరమే: చదువు మధ్యలో విరామం తీసుకుంటూ ఉండాలి. ఆ సమయంలో మెదడు పునరుత్తేజం పొందేలా వర్డ్ పజిల్స్ పూరించడం.. లాంటివి చేయొచ్చు.
మార్గదర్శి ఉంటే: చదవడానికి ఎలాంటి పద్ధతులను అనుసరించాలి, అసలు ఏ పద్ధతుల్లో చదివితే మంచిది. పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించే మార్గాలేవి.. ఏ సబ్జెక్టుల్లో పట్టు సాధిస్తే ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది.. ఇలాంటి ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో మీకో మార్గదర్శి (మెంటర్) ఉంటే వీటి నుంచి బయటపడటం సులువు అవుతుంది. మీరు ఏమైనా పొరపాట్లు చేసినా సరిదిద్ది.. సరైన మార్గాన్నీ చూపిస్తారు. అధ్యాపకులు, సీనియర్లు, కుటుంబసభ్యులు.. వీరిలో ఎవరినైనా మార్గదర్శిగా ఎంచుకోవచ్చు.
ఈ అలవాటూ మంచిదే: కొంతమందికి సంగీతం వింటూ చదువుకునే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల విసుగు లేకుండా సంతోషంగా చదవగలుగుతారు. అయితే ఈ పద్ధతి అందరికీ సరికాదు. కొందరికి చిన్న శబ్దం వినిపించినా ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇలా చదివితే కొందరు ఏకాగత్రను కోల్పోయి.. పూర్తిగా సంగీతం మీదే దృష్టిని కేంద్రీకరించే అవకాశమూ ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతి మీకు ఎంతవరకూ సరిపడుతుందో పరీక్షించుకోవాలి. అనుకూలంగా ఉందనుకుంటేనే కొనసాగించాలి.
మీకు మీరే పోటీ: ఆసక్తిగా చదవడాన్ని అలవాటుగా మార్చుకోవాలంటే మీకు మీరే పోటీగా మారాలి. సాధారణంగా ఎదుటివాళ్లకంటే బాగా చదవాలనీ, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనీ.. ఇలా ఇతరులతో పోటీపడుతుంటారు కదా. అలాగే మీతో మీరూ పోటీపడటం మొదలుపెట్టాలి. ఇలాచేస్తూ ఆసక్తినీ, నైపుణ్యాలను పెంచుకోవాలి. ఉదాహరణకు మీరు గంటకు పది గణిత సమస్యలను గతంలో పరిష్కరించేవారు అనుకుందాం. ఇకనుంచి దీన్నే ఛాలెంజ్‌గా తీసుకుని పన్నెండు సమస్యలను పరిష్కరించగలగాలి.
అరగంటలో మూడు ప్రశ్నలకు సమాధానాలు చదవగలరు అనుకుందాం. అదే సమయంలో ఐదు సమాధానాలు చదవగలగాలి. అలాగే గత పరీక్షల్లో మీకు 90 శాతం మార్కులు వచ్చాయనుకుందాం. రాబోయే పరీక్షల్లో 100 శాతం సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకోవాలి. మీకు మీరే పరిధులను అధిగమిస్తూ.. ఎప్పటికప్పుడు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించాలి. అంటే మీకు మీరే పోటీగా నిలిచి విజయం సాధించాలి.
ఇవీ చదవండి: