వాహనాల ఫాస్టాగ్ నిబంధనలను కేంద్రం మరింత కఠినతరం చేసింది. టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ లేకుండా ఆ మార్గంలోకి వాహనం వెళ్లినా, ఫాస్టాగ్ పనిచేయకున్నా రెండింతలు అదనంగా రుసుము వసూలు చేయనున్నారు. టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు, నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించేందుకు ఫాస్టాగ్ విధానాన్ని గత డిసెంబరు నుంచి కేంద్రం అమలులోకి తీసుకువచ్చింది. అన్ని టోల్‌ప్లాజాల వద్ద ఒక్కో మార్గం మాత్రమే నగదు రూపంలో రుసుము చెల్లింపునకు అనుమతి ఇచ్చింది.
ఇతర వాహనాలను నియంత్రించేందుకు..
ఫాస్టాగ్ కోసం ప్రత్యేకించిన మార్గంలోకి ఇతర వాహనాలు వస్తే రెండింతలు అదనపు రుసుము వసూలు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లే అన్ని మార్గాల్లో కలిపి 18 ప్రాంతాల్లో టోల్‌ప్లాజాలు ఉన్నాయి. మునుపటి మాదిరిగానే ఒక్కో మార్గాన్ని నగదు చెల్లింపుదారుల కోసం కొనసాగించనున్నట్లు జాతీయ రహదారుల సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ వెల్లడించారు.
ఇదీ చదవండి: వలస కూలీలను ఫోన్ నంబర్‌తో పట్టేస్తారు