డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు నేటితో ముగియనుంది. నిన్న సాయంత్రం వరకు లక్షా 77 వేల 485 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. వారిలో లక్షా 39 వేల 76 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆధార్ అనుసంధాన మొబైల్ ద్వారా లేదా మీ-సేవా కేంద్రాలు, టీఎస్ యాప్ ఫోలియోతో పాటు.. 105 సహాయ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని లింబాద్రి తెలిపారు.
ఈ నెల 31న డిగ్రీ మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 5 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత రిజిస్ట్రేషన్లు ఆగస్టు 1 నుంచి 9 వరకు.. వెబ్ ఆప్షన్లు ఆగస్టు 2 నుంచి 9 వరకు నిర్వహించి.. ఆగస్టు 14న రెండో విడత డిగ్రీ సీట్లు కేటాయించనున్నారు.
ఎంసెట్ హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం..
మరోవైపు ఎంసెట్ హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునేందుకు హాల్ టికెట్లను ఎంసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
బిట్ శాట్, ఎంసెట్ ఒకే రోజు ఉన్న విద్యార్థులు.. సమాచారం ఇస్తే మరో రోజుకు మారుస్తామని కన్వీనర్ తెలిపారు. ఇవాళ్టి వరకు ఇంజినీరింగ్‌కు లక్షా 63 వేలు.. వ్యవసాయ, ఫార్మాకు 85 వేల 828 కలిపి.. మొత్తం 2 లక్షల 49 వేల దరఖాస్తులు వచ్చినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్దన్ తెలిపారు. ఎంసెట్‌కు రూ.500 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆగస్టు 4 నుంచి 10 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: ICMR SERO SURVEY: రాష్ట్రంలో 60 శాతం మందిలో కొవిడ్ యాంటీ బాడీలు