KTR Interview on BRS National Politics : భారత్ రాష్ట్ర సమితి జాతీయస్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నామని.. రెక్కల్ని క్రమేణా విస్తరించుకుంటూ వెళ్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కే తారకరామారావు తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల దిశగా సన్నద్ధమవుతున్నామని చెప్పారు. అప్పటిలోగా ఎంతగా పుంజుకుంటామో చూడాలన్నారు. ఆ ఎన్నికలతోనే తమ పార్టీ పోరాటం ముగియదని స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ కొనసాగుతుంది చెప్పారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనే తమకు 272 మ్యాజిక్ నంబర్లు వస్తాయని.. గణనీయమైన సీట్లలో విజయం సాధిస్తామని వెల్లడించారు. దేశానికి కాంగ్రెస్, బీజేపీలు ప్రమాదకరంగా పరిణమించాయని.. ఈ రెండు పార్టీల కూటములేవీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించలేవని మంత్రి పేర్కొన్నారు. ఇంకా పలు ఆంశాలపై మంత్రి కేటీఆర్ తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.
మమ్మల్ని తక్కువగా అంచనా వేయొద్దు : రోమ్‌ను ఒక రోజులో నిర్మించలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ నేడు పెద్ద శక్తి అని.. దాన్ని ఎవరూ కాదనలేరని కానీ వారు ఇద్దరు ఎంపీలతో ప్రయాణాన్ని ప్రారంభించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. 'మమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేయొద్దు. వెయ్యి మైళ్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవ్వాల్సిందే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లలో 9 స్థానాలు కైవసం చేసుకున్నాం. ఇప్పుడు మా పార్టీ విస్తరణ ప్రణాళికను అమలు చేస్తున్నాం. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మహారాష్ట్రలో నిర్వహించిన నాలుగు బహిరంగ సభలు కూడా విజయవంతమయ్యాయి. ఆ రాష్ట్రంలో వచ్చే జడ్పీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నాం. మహారాష్ట్ర, ఏపీ, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటకల్లో బీఆర్ఎస్ రెక్కలు విస్తరించనుంది' అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
KTR Interview on BRS Expansion in Maharashtra : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాం.. గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుపొందాలనే లక్ష్యంతో జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకరిని అధికారం నుంచి ఉంచడమో.. లేక తొలగించడమో బీఆర్ఎస్ ఎజెండా కాదని, ప్రజల గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. దేశానికి సంబంధించిన ప్రధాన సంక్షేమ సూత్రాల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీపడదని అన్నారు.
దేశానికి మంచి నాయకత్వం అవసరం: ఉపాధి కల్పన, రైతులకు సంపద, నీటిపారుదల, గ్రామీణ జీవనోపాధి లాంటివి దేశానికి ముఖ్యమైనవని .. హలాల్, హిజాబ్, మతం పేరిట విద్వేషాలు కావని కేటీఆర్ తెలిపారు. గత 75 సంవత్సరాలుగా దేశం వెనుకబడిపోవడానికి కాంగ్రెస్, బీజేపీలే కారణమన్నారు. ఈ దేశానికి మంచి నాయకత్వం అవసరం ఉందని స్పష్టం చేశారు. సొంత పద్ధతిలో ఎదగడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్రాల సంబంధాలు కొనసాగాల్సిందే : 'తెలంగాణ సమీకృతంగా, సమష్టిగా అభివృద్ధి చెందుతోంది. దేశవ్యాప్తంగా తెలంగాణ నమూనా అవసరం. రాష్ట్రంలో మూడోసారి కూడా మా పార్టీ వరుసగా అధికారంలోకి వస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ హ్యాట్రిక్ సీఎం అవుతారు. రాష్ట్రంలో కేసీఆర్ను ఎదుర్కొనేలా దీటైన ప్రతిపక్షం లేదు. మా ప్రభుత్వం చేసిన అభివద్ధి, సంక్షేమమే మాకు తిరిగి మళ్లీ అధికారాన్ని తెచ్చిపెడతాయి. వైఎస్ షర్మిలకు ఆత్మగౌరవముంటే.. వారి కుటుంబం మొత్తం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినందున ఆమె రాష్ట్రంలో అడుగుపెట్టకూడదు' అని మంత్రి అన్నారు.
కేంద్ర మంత్రులను కలవడంపై వస్తున్న విమర్శలకు మంత్రి స్పందిస్తూ.. తాను దిల్లీకి ఒకసారి కాదు, గతంలోనూ చాలాసార్లు వచ్చానని బదులిచ్చారు. అలాగే కేంద్ర మంత్రులను కూడా కలిశానని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను ఏదో ఒక దశలో కొనసాగించాల్సిందేనని.. అదే చేస్తున్నామని చెప్పారు. కేంద్రానికి ఇచ్చిన వినతులను మన్నించి, పరిష్కరిస్తే వారికి కృతజ్ఞతలు చెబుతామని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇవీ చదవండి: