కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 31 వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావొద్దని సీపీ సూచించారు. పరిస్థితి విషమించక ముందే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రజలంతా దీనికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి పరిస్థితిని చేయిదాట నీయోద్దని కోరారు. ఎవరూ క్యాబ్‌లు బుక్ చేసుకోవద్దని సూచించారు. కాదని నిబంధనలు ఉల్లంఘిస్తే క్యాబ్ డ్రైవర్లు, వినియోగదారులపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఇలా కొనాలి...అలా వెళ్లిపోవాలి
విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉండకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. సమీపంలో ఉన్న దుకాణాల్లో నిత్యావసరాలు కొనుక్కుని వెంటనే ఇళ్లలోకి వెళ్లాలని పేర్కొన్నారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడవద్దని కోరారు. హైదరాబాద్‌లో కూడా చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తామన్నారు. సాయంత్రం 6 తర్వాత ఫుడ్ డెలివరీ సంస్థలు ఆర్డర్లు తీసుకోవద్దని సూచించారు. ప్రయాణాల విషయంలో ఎలాంటి కారణాలు చెప్పినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.