లాక్డౌన్ వల్ల ఆకలితో అలమటిస్తున్న పేదలకు వైద్యులు చేయూతనిస్తున్నారు. వారి కాలనీలకు వెళ్లి భోజనమందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. రోజుకు కొంత మంది చొప్పున కలిసి భోజనం పంపిణీ చేస్తూ తమ మంచి మనసును చాటుకుంటున్నారు నల్గొండకు చెందిన వైద్యుల సంఘం సభ్యులు.
వాళ్లు ఆరంభించారు.. వీళ్లు అనుసరించారు
నల్గొండ శివారులోని లెప్రసీ కాలనీ, రిక్షాపుల్లర్ల కాలనీల్లో అర్ధాకలితో కాలం గడుపుతున్న వారిని చూసి చలించిపోయిన వైద్యుల సంఘం నాయకులు... తక్షణమే భోజన సదుపాయం కల్పించాలని భావించారు. ముందుగా తామే ఆచరణలోకి దిగిన సంఘం నాయకులు... క్రమంగా మిగతా సభ్యుల్ని రంగంలోకి దింపారు.
రోజుకు 350 మందికి భోజనం
సంఘంలో మొత్తం 150 మంది సభ్యులుండగా.. రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున వైద్యులు కలిసి పేదల కడుపు నింపుతున్నారు. రోజుకు సుమారు 350 మందికి భోజనమందిస్తున్నామని వైద్యులు తెలిపారు. రోజు రూ.15 వేల ఖర్చు వస్తోందని, కడుపు నిండా భోజనం తిన్నతర్వాత వారి కళ్లలో కనిపించే ఆనందం ఎంతో తృప్తిని కలిగిస్తోందంటున్నారు నల్గొండ వైద్యులు.
ఆదుకున్నారు
లాక్డౌన్ వల్ల తిండి లేక తిప్పలు పడుతున్న తాము నల్గొండ వైద్యులకు తమ గోడు వెల్లబోసుకున్నామని లెప్రసీ కాలనీ వాసులు తెలిపారు. ఏదో ఒకటి రెండ్రోజులు ఆదుకుంటారనుకున్నాం కానీ లాక్డౌన్ ముగిసే వరకు తమ ఆకలి తీరుస్తారని అనుకోలేదని చెప్పారు. తమకు వైద్యమందించడమే గాక.. కరోనా ఆపత్కాలంలో అండగా నిలుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇన్నాళ్లు వారికి వైద్యమందిస్తూ అండగా ఉన్న వైద్యులు ఇప్పుడు ఆకలి తీరుస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.