రాష్ట్ర కొత్త సచివాలయ భవన నిర్మాణ కసరత్తు వేగవంతం అవుతోంది. పాత భవనాల కూల్చివేత ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. మిగతా బ్లాకుల కూల్చివేత ఇప్పటికే పూర్తి కాగా, జే, ఎల్ బ్లాకుల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. పెద్దభవనాలు కావడం వల్ల కూల్చివేత ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. రెండు భవనాల్లో ఇంకా 20 నుంచి 30 శాతం వరకు కూల్చివేత మిగిలి ఉంది.
శిథిలాలను ఇప్పటికే
ఓ వైపు కూల్చివేతలు కొనసాగుతుండగానే ఎప్పటికప్పుడు శిథిలాలను తరలిస్తున్నారు. మిగతా భవనాల శిథిలాలను ఇప్పటికే పూర్తిగా తరలించారు. ఈ వారంలో కూల్చివేత ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు. ఓ వైపు కొత్త భవన సముదాయ నమునాపై తుది కసరత్తు చేస్తున్నారు. ఆర్కిటెక్టులు రూపొందించిన నమూనాకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్.. లోపల కార్యాలయాలు, పేషీలు, ఇతరత్రాలకు సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులు చేశారు.
ముఖ్యమంత్రి కార్యాలయం ఏడో అంతస్తులో
సీఎం సూచనలకు అనుగుణంగా నమునాకు తుది మెరుగులు దిద్దారు. మంగళవారం మరోమారు సీఎం నమూనాను పరిశీలించే అవకాశం ఉంది. ఏడు అంతస్తుల్లో కొత్త సచివాలయ భవన నిర్మాణం జరగనుంది. ముఖ్యమంత్రి కార్యాలయం ఏడో అంతస్తులోనే రానుంది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కొత్త సచివాలయ భవన సముదాయ నమునాకు ఆమోదం తెలిపి నిర్మాణ పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తరువాత భవన నిర్మాణం కోసం రహదార్లు, భవనాల శాఖ టెండర్లు పిలవనుంది.
ఇదీ చూడండి : పెళ్లికి చినిగిన షేర్వాణి... దుకాణదారుడికి రూ.50 వేల ఫైన్