రాష్ట్ర కాంగ్రెస్‌లో ఒరిజినల్, వలస అంటూ సీనియర్లు అసంతృప్త గళం వినిపించిన వేళ విభేదాల పరిష్కారానికి అధిష్ఠానం చొరవ తీసుకుంది. ఆ క్రమంలోనే దిల్లీ దూతగా వచ్చిన ఏఐసీసీ కార్యదర్శి, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్.. మూడు రోజుల పాటు వారితో వరుస భేటీలు జరిపారు. పార్టీ సీనియర్‌లంతా సంయమనం పాటించాలని సూచించారు. పార్టీలో జూనియర్, సీనియర్ అనే తేడా ఉండదని స్పష్టం చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతలందరితో విడివిడిగా మంతనాలు జరిపారు. నేతలంతా కలిసి పని చేస్తేనే ప్రత్యర్థులను ఓడించగలమని.. పార్టీ విషయాలు అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్పితే బహిరంగ విమర్శలు చేసుకోవద్దని దిగ్విజయ్ సింగ్ సూచించారు. పరిస్థితులకు అనుకూలంగా కొత్తవారికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చి, విజయాలు సాధించినట్లు చెప్పారు.
"కాంగ్రెస్‌లోని కార్యకర్త నుంచి సీనియర్ నేత వరకు అందరికి చేతులు జోడించి అర్థిస్తున్నా. కాంగ్రెస్ నేతలు సమస్యలు, ఏదైనా విషయంపైన మాట్లాడాలంటే పార్టీలో అంతర్గతంగా చెప్పండి. ఎవరూ బయట మాట్లాడకండి. నేతలెవరైనా పరస్పర విమర్శలు చేసుకోవడం పార్టీకి మంచిది కాదు. అందరిని కలిసి నాయకులతోనూ విడివిడిగా సావధానంగా మాట్లాడాను. అందరూ కలిసి పార్టీని ముందుకుతీసుకెళదాం. పార్టీలో జూనియర్, సీనియర్లంటూ తేడా ఏమీ లేదు. పార్టీలో తలెత్తిన సమస్యలన్నీ సర్దుకున్నట్టే." - దిగ్విజయ్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
బీఆర్ఎస్, బీజేపీపై విమర్శలు గుప్పించిన దిగ్విజయ్.. బీజేపీకి మేలు చేకూర్చేందుకు కేసీఆర్, ఓవైసీ పనిచేస్తుంటారని ఆరోపించారు. బీజేపీకి కేసీఆర్ బీ-టీమ్‌గా పనిచేస్తున్నారంటూ ఆక్షేపించారు.
తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన సాగుతోంది. కేసీఆర్ తెరాసను భారాసగా మార్చారు. భారాసకు భాజపాకు సంబంధమేంటి..? పార్లమెంట్‌లో కేసీఆర్.. భాజపాకు సంపూర్ణ మద్దతిస్తారు. సభలో దోస్తీ బయట మాత్రం కుస్తీ చేస్తుంటారు. ఎంతచేసినా భారాస, భాజపా రెండు పార్టీలు ఒక్కటేనని ప్రజలకు తెలుసు. మైనార్టీల పట్ల భాజపా అనుసరిస్తున్న వైఖరిని ఓవైసీ ఎందుకు ప్రశ్నించరు..? భాజపాను గెలిపించేందుకే ఎంఐఎం ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తోందనేది సుస్పష్టం. - దిగ్విజయ్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
పార్టీలో సీనియర్లను ఆధారాలు లేకుండా కోవర్టులు అనడం సరైంది కాదని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. పీసీసీ, సీఎల్పీ నాయకుల తీరును ఏఐసీసీ నిశితంగా గమనిస్తోందన్న ఆయన.. పార్టీ కోసం ఎవరేం చేశారో పిలిచి అడుగుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. పార్టీలో ఏదైనా సమస్య తలెత్తితే సమన్వయం చేయాల్సిన బాధ్యత ఏఐసీసీపై ఉంటుందన్నారు.
ఇవీ చదవండి: కొవిడ్‌పై పోరులో మరోమారు ముందంజలో హైదరాబాద్: కేటీఆర్
భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్.. దిల్లీలో రాహుల్‌తో కలిసి నడక