Different Types of Food in Hyderabad: ఆహా ఏమి రుచి.. తినరా మైమరిచి అంటూ అన్ని ప్రాంతాల రుచులను అందిస్తోంది భాగ్యనగరం. అందుకే ఈ చారిత్రక నగర ఆహారానికి యునెస్కో సైతం దాసోహం అన్నది. విభిన్న రుచుల కోసం నగరంలో.. ఉత్తర భారత్ 467, దక్షిణ భారత్ 278, చైనీస్ 266, యురోపియన్ 90, ఇటాలియన్ 97, అరేబియన్ 60, పాన్ ఏషియన్ 36, అమెరికన్ 19, సీ ఫుడ్ 16, లెబనీస్ 16, థాయ్ ఫుడ్ 14, రాజస్థానీ 5, టర్కిష్ 13, గోన్(పోర్చుగీస్) 3, జపనీస్ 2, మలేషియన్ 2, టిబెటన్ 2, నేపాలీస్ 2, ఆఫ్ఘానీ 2, ఈశాన్య రాష్ట్ర 2, పార్శీ 1 ఆహార కేంద్రాలున్నాయి.
‘దక్షిణ’ రుచుల రాజధాని..
దక్షిణ భారత్ రుచులకు నగరమే రాజధాని. కేరళ పుట్టీ నుంచి కోనసీమ కోడి వేపుడు, రాయలసీమ రాగి సంగటి, తెలంగాణ బోటీ కూర వరకు వంటకాలను ప్రత్యేకంగా వడ్డించే హోటళ్లు ఇక్కడున్నాయి.
తెలుగు రుచికి..
పళ్లెంలో పది రకాల రుచులుంటేనే సంపూర్ణ భోజనం. నగరంలోని వివాహ భోజనంబు, కృష్ణపట్నం, పాకశాల, సుబ్బయ్య గారి హోటల్‌తో పాటు పదుల సంఖ్యలో హోటళ్లలో అచ్చమైన తెలుగింటి భోజనం దొరుకుతుంది.
విదేశీ ఘుమఘుమలు..
బంజారాహిల్స్ రోడ్ నెం.1లో హంగేరియన్, మెక్సికన్, లెబనీస్ సిగ్నేచర్ వంటకాల్ని వడ్డించే హోటల్ ఉంది. హంగేరియన్ స్ట్రీట్ ఫుడ్‌లో చిమ్నీ కోన్స్, చిమ్నీ కేకులు లభిస్తాయి. బంజారాహిల్స్ రోడ్ నెం.3లో లెవాంట్ హోటల్ టర్కిష్ రుచుల్ని అదానా, రెష్మి, ల్యాంప్ కబాబులు, దాదాపు 6, 7గంటల పాటు వండే తాజెన్, జర్బ్‌లాంటి కొత్త రుచులూ ఇక్కడుంటాయి. సైబరాబాద్‌లో ఏర్పాటైన తొలి కొరియన్ హోటల్ ‘గొగురియో’ రద్దీగా ఉంటుంది.
నవాబీ హవా
నవాబుల రుచుల్లో బిర్యానీ తర్వాత పాయ, నిహారి, పత్తర్ కా ఘోష్, లుక్మీ.. ఇలా ఎన్నో ప్రత్యేక వంటకాలుండేవి. ఇటీవల వీటివైపు దృష్టి తగ్గినా.. ఇప్పటి ఆహార ప్రియులు, వ్లాగర్లు వీటికే మొగ్గు చూపుతున్నారు. ‘చిచాస్’లాంటి రెస్టారెంట్లు, చార్మినార్ పరిసర హోటళ్లు కట్టీ దాల్, తలవా ఘోష్, మగర్‌లకు చిరునామా. వండేందుకే 8 గంటలు పట్టే ‘ఖుజీ’లాంటి రుచులకు ప్రత్యేక డిమాండ్ ఉంది.
వేడుకలకు హరిత హోటళ్లు
కొత్త సంవత్సర వేడుకల జోష్‌ను అందిపుచ్చుకొనేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ సన్నాహాలు చేసింది. ప్రముఖ పర్యాటక కేంద్రాల్లోని హరిత హోటళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఎంత మంది వెళ్లదలుచుకున్నారో ముందే చెబితే.. తదనుగుణంగా రవాణా, బస, భోజన వసతి కల్పించడానికి ఏర్పాట్లు చేస్తామని సంస్థ చెబుతోంది.
ప్రకృతి ఒడిలో.. జంట నగరాలతోపాటు.. రాష్ట్ర వ్యాప్తంగా 17 చోట్ల ప్రకృతి ఒడిలో సేదదీరడానికి వెసులుబాటు ఉంది. నగరానికి చేరువలోని అనంతగిరి, నాగార్జున సాగర్, లక్నవరం, సోమశిల, యాదాద్రి, ఆలంపూర్, గద్వాల్ హరిత హోటల్, భద్రాద్రి కొత్తగూడెం, జన్నారం, బాసర, కడెం ప్రాజెక్టుల వద్ద బస చేయవచ్చు. ధర్మపురి, వేములవాడ, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెళ్లినా 20 కి.మీ. పరిధిలో ఒక హరిత హోటల్ అందుబాటులో ఉంది. వరంగల్, టూరిజం ప్లాజా, నాగార్జున సాగర్, తారామతి బారాదరిలో బార్ అండ్ రెస్టారెంట్లు అందుబాటులో ఉన్నాయి. 040-23262327 తోపాటు.. 170042546464 టోల్‌ఫ్రీ నంబరుకు ఉదయం 7.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకూ ఫోను చేస్తే పూర్తి వివరాలు అందజేస్తారు.
కరోనా నిబంధనల నడుమ...
హరిత హోటళ్లలో కరోనా నిబంధనలు పాటించడంతోపాటు, వంద శాతం టీకాలు తీసుకున్న సిబ్బంది యాత్రికులకు సేవలందిస్తారని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఛైర్మన్ శ్రీనివాసగుప్తా తెలిపారు. అన్ని కేటగిరీల వారికీ అనుకూలమైన ప్యాకేజీలు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: 'ఇళ్ల ధరల పెరుగుదలలో దేశంలోనే హైదరాబాద్ టాప్'