రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీ. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు ఆర్టీసీ బస్సుల్లో చేరవేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు 3,422 రూట్లలో తిరుగుతున్నాయి. ఆర్టీసీకి సొంత బస్సులు 6,578, అద్దె బస్సులు 3,127 కలిపి మొత్తం 9,705 బస్సులు ఉన్నాయి. కొవిడ్‌కు ముందు ఆర్టీసీ బస్సుల్లో 37.93 లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం సుమారు 31లక్షల పైచిలుకు ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆర్టీసీలో మొత్తం 48,189 మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. వీరిలో కండక్టర్లు 19,760 మంది, డ్రైవర్లు 17,562 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో ఈనెల 7న మొదటిసారిగా డీజిల్ ధరలు సెంచరీ కొట్టాయి. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈనెల 7న రూ.100.51లు, 8న రూ.100.51, 9న రూ.100.89లు, 10న రూ.101.27, 11న రూ.101.66, 12న రూ.101.66, 13న రూ.101.66, 14న 102.04, ఈనెల 15న రూ.102.42 కు చేరుకున్నాయి. దీంతో నిత్యం కోట్ల లీటర్ల డీజిల్ వినియోగించే ఆర్టీసీపై పెనుభారం పడుతోంది.
ఆర్టీసీపై పెనుభారం
బస్సులు నడవాలంటే ఇంధనం కావాల్సిందే. ఇటీవలి కాలంలో డీజిల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో అది ఆర్టీసీపై ప్రభావం చూపెడుతోంది. గతంలో రూ.68కి లీటర్ ఉండగా... ప్రస్తుతం లీటర్‌కు రూ.102.42లకు చేరిపోయింది. ఇందులో వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీకి ఆర్టీసీ ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. గడిచిన ఆరేళ్లలో రూ.8117.74 కోట్లు డీజిల్‌కు ఖర్చు చేస్తే.. అందులో వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీకీ రూ.మూడు వేల కోట్ల పైచిలుకు ఖర్చు చేశారు. ఆర్టీసీపై ఎక్సైజ్, డ్యూటీని మినహాయించాలి..లేదంటే తగ్గించాలని ఆర్టీసీ సంఘాలు కోరుతున్నాయి.
గడిచిన ఆరేళ్లలో డీజిల్ కోసం ఖర్చు చేసింది :
క్ర. సం | సంవత్సరం | వినియోగించిన డీజిల్ (కోట్ల లీటర్లలో) | అందుకోసం చేసిన ఖర్చు (కోట్లలో) |
1. | 2014-15 | 20.86కోట్ల లీటర్లు | రూ.1230.73కోట్లు |
2. | 2015-16 | 19.53 | 960.29కోట్లు |
3. | 2016-17 | 19.17 | 1068.91 |
4. | 2017-18 | 20.05 | 1177.32 |
5. | 2018-19 | 19.90 | 1367.19 |
6. | 2019-20 | 17.14 | 1151.08 |
7. | 2020-21 | 10.04 | 736.24 |
8. | 2021-22 | 4.89 | 425.97 |
మెుత్తం | రూ. 8117.74కోట్లు |
2014 నుంచి ఇప్పటి వరకు కేవలం డీజిల్ కోసం రూ.మొత్తం రూ.8117.74 కోట్లు ఆర్టీసీ ఖర్చు చేసింది.
ఎంత కష్టపడ్డప్పటికీ..
డ్రైవర్లు, కండక్టర్లు తాము ఎంత కష్టపడ్డప్పటికీ.. ఫలితం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్యుపెన్షీ రేషియో ఎంత పెంచినప్పటికీ... పెరిగిన డీజిల్ ధరలు వాటిని దెబ్బతీస్తున్నాయంటున్నారు. దీంతో డిపో మేనేజర్లు తమకు టార్గెట్లు విధిస్తున్నారని వాపోతున్నారు. ప్రయాణికులను ఎంత బతిమాలి ఎక్కించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుందంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులకు వినియోగించే డీజిల్‌పై ఎక్స్సైజ్ , డ్యూటీ సుంకాన్ని ఎత్తివేయాలని.. లేదంటే తగ్గించాలని ఆర్టీసీ యూనియన్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: Telangana Governor Tamilisai : 'ఎన్‌ఎస్‌జీ కమెండోలు ధైర్యానికి ప్రతీక'