Telangana DH on Summer arrangements : రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని.. వడదెబ్బ బాధితుల కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని డీహెచ్ శ్రీనివాసరావు అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలను ఆదేశించారు. ప్రతి రోజు జిల్లావారి వడదెబ్బ ఘటనలకు సంబంధించిన నివేదిక అందించాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ విధానాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇందుకోసం జిల్లా ఎపిడమిక్ కార్యాలయంలో.. కంట్రోల్ రూమ్లను సిద్ధం చేసి.. 24 గంటల పాటు సేవలు అందేలా చూడాలని ఆయన పేర్కొన్నారు.
DH Srinivas rao on Summer arrangements : టీఎస్ఎంఐడీసీ, సీడీసీలతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు తగు మందులు, ఫ్లూయిడ్లు, ఓఆర్ఎస్లను సిద్ధంగా ఉంచుకోవాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. ప్రజలకు వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వడదెబ్బ బారిన పడినవారికి చేయాల్సిన ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అత్యవసర కేసులను తక్షణం పెద్దాసుపత్రులకు పంపాలని స్ఫష్టం చేశారు. దాతలతో కలిసి చలివేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలని తెలిపారు. అన్ని విభాగాల అధికారులతో కలిసి పనిచేయాలని డీఎంహెచ్ఓలకు శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఈ ప్రత్యేక చర్యలు అవసరం: ఓఆర్‌ఎస్ పాకెట్లు, ఐవీ ఫ్లూయిడ్స్, అత్యవసరమైన మందులను అన్ని వైద్య, ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్ల వద్ద ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో చేరేచోట, మురికివాడలు, బలహీనవర్గాల కాలనీల్లో ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల స్థాయిలో, జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయాలని వివరించారు. ప్రతి రోజూ మంచినీటి క్లోరినేషన్ జరిగేలా.. చలివేంద్రాల్లో సురక్షితమైన నీరు అందుబాటులో ఉండేలా వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
రద్దీగా ఉండే ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలి: మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తెలిపారు. నీటి క్యాన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. వడగాడ్పుల సమయంలో నీటి లభ్యత కీలకమని పేర్కొన్నారు. గతం కన్నా ఈ దఫా వడగాడ్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల రాష్ట్రాలను అప్రమత్తం చేసిందని వివరించారు.
వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి విషయంలో రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు అప్రమత్తంగా ఉండాలని అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. సరఫరా, పంపింగ్ వ్యవస్థల నిర్వహణ పనులను ముందుగానే చేయించాలని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. నీటిపారుదల, విద్యుత్తుశాఖ అధికారులు సమన్వయంతో ఉండాలని ఆదేశించారు. అగ్నిప్రమాద నియంత్రణ అధికారులతోనూ కలిసి కార్యాచరణను రూపొందించాలని అర్వింద్ కుమార్ స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: ఇవాళ ఒక్కరోజే భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి...
TSPSC పేపర్ లీకేజీ వ్యవహారం.. వెలుగులోకి వస్తున్న ప్రవీణ్ లీలలు
60 అడుగుల బోరు బావిలో పడ్డ బాలుడు.. కోతులకు భయపడి పరిగెత్తి..