వ్యాక్సిన్లకు కొరత ఏర్పడిన నేపథ్యంలో మే 31 వరకు రెండో డోసు వారికే వ్యాక్సిన్ ఇస్తామని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం... విధిలేని పరిస్థితుల్లోనే లాక్‌డౌన్ విధించిందని అన్నారు. ప్రభుత్వం అనుమతించిన 4 గంటల్లోనే బయటకు రావాలని సూచించారు. నిత్యావసరాల కోసం ఇంటి నుంచి ఒకరు వస్తే సరిపోతుందని.. అందరూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు సహకరిస్తేనే లాక్‌డౌన్ ఫలితాలు అందుతాయని వ్యాఖ్యానించారు.
ఆరోగ్య సేవల విషయంలో లాక్‌డౌన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని, కరోనా పరీక్షలు, వ్యాక్సిన్ల కోసం బయటకు వచ్చే వారికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉందని శ్రీనివాసరావు తెలిపారు. తగిన పత్రాలు చూపి పోలీసుల అనుమతి పొందవచ్చన్నారు. ఆస్పత్రుల్లో పడకల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.
రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకల కొరత లేదని, ప్రస్తుతం 5,783 ఆక్సిజన్ పడకలు, 17,267 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాలకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు ఆస్పత్రులు ఆక్సిజన్‌ను సక్రమంగా వినియోగించాలని శ్రీనివాసరావు సూచించారు. ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ గురించి స్టేట్ టాస్క్ ఫోర్సు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, ఆక్సిజన్ మానిటరింగ్ టీమ్స్‌ను ఇప్పటికే ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
కొవిషీల్డ్ వ్యాక్సిన్.. ఆరు నుంచి 8 వారాలలోపు, కొవాగ్జిన్.. 4 నుంచి 6 వారాలలోపు రెండో డోసు తీసుకోవచ్చన్నారు. ఇంకా 15 లక్షల మంది రెండోడోసు తీసుకోవాల్సి ఉందని, మే 31 వరకు వీరందరికీ పూర్తి చేసి, మిగతావారికి దశలవారీగా ఇస్తామని అన్నారు.
ఇదీ చూడండి: ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్