పోలీస్ శాఖలో చేపట్టిన సంస్కరణల వల్లే నేరాల ఛేదనలో తెలంగాణ పోలీసులు ముందున్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ప్రజల రక్షణే ప్రధాన ధ్యేయంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పోలీసు అధికారిపై ఉందని పేర్కొన్నారు. విశ్రాంత పోలీసు అధికారి తిరుపతి రెడ్డి రచించిన ఆదర్శ పథంలో పోలీసు- సమగ్ర పరిశీలన అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పోలీసులు ముందు వరుసలో ఉన్నారని రచయిత పుస్తకంలో ప్రస్తావించారు. సీసీ కెమెరాల ఏర్పాటు.. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల పోలీసింగ్‌లో వచ్చిన మార్పులు, ఫలితాల గురించి రచయిత తిరుపతి రెడ్డి పుస్తకంలో వివరించారు. పోలీసు వ్యవస్థ ప్రజలతో ఎలా మమేకం కావాలి.. ఎలా పనిచేయాలి అనే అంశాలను తిరుపతి రెడ్డి తన పుస్తకంలో వివరించారని మహేందర్ రెడ్డి తెలిపారు.
ప్రపంచంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అతి పురాతన వాటిలో ఒకటని.... హైదరాబాద్ కొత్వాల్‌గా పనిచేసిన రాజబహదూర్ వెంకటరామిరెడ్డి ఆధునిక పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టారని డీజీపీ గుర్తుచేశారు. పోలీసుశాఖలోని హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని చదవాలని సూచించారు. దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా లక్షా 50 వేల మంది మరణిస్తున్నారని.. ఈ కేసుల దర్యాప్తు, నిందితులకు ఎలా శిక్ష పడాలి అనే అంశాలను తెలియజేస్తూ మరో పుస్తకం వెలువరించడం పట్ల రచయితను డీజీపీ అభినందించారు. పౌర సమాజానికి అవసరమయ్యేలా ఎన్నో అంశాలను ఈ పుస్తకంలో పొందుపర్చినట్లు రచయిత తిరుపతి రెడ్డి తెలిపారు.