మినీ పురపోరులో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా ఎన్నికల ఖర్చుల వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఆయా జిల్లాల కలెక్టర్లకు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో చట్టప్రకారం వారు మూడేళ్ల పాటు అనర్హులు కావడంతో పాటు ఎన్నికై ఉంటే పదవులనూ కోల్పోతారని పేర్కొంది.
ఇటీవల జరిగిన మినీ పురపోరు సందర్భంగా నాలుగు వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఏప్రిల్ 22న ప్రకటించారు. మిగిలిన స్థానాల ఫలితాలు మే మూడో తేదీన ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన చోట్ల జూన్ ఎనిమిదో తేదీతో, మిగతా స్థానాల్లో జూన్ 16వ తేదీతో 45 రోజుల గడువు పూర్తవుతుంది. ఆ లోగా అభ్యర్థులందరూ తమ ఎన్నికల ఖర్చుల వివరాలు అందించాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది.
అభ్యర్థులకు రెండు విడతలుగా నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఎస్ఈసీ ఆదేశించింది. మే 15వ తేదీన మొదటి నోటీసు, జూన్ నాలుగో తేదీన రెండో నోటీసు ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: లాక్డౌన్పై రేపు సీఎం కీలక నిర్ణయం