రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో... వైద్యారోగ్య, విద్య, పోలీస్, జైళ్ల, శిశు సంక్షేమ శాఖలు, జీహెచ్ఎంసీ హైకోర్టుకు వేర్వేరుగా నివేదికలు సమర్పించాయి. డెల్టా ప్లస్ వేరియంట్ (Delta Plus variant) పట్ల అప్రమత్తంగా ఉన్నామని వైద్యారోగ్య శాఖ ఇప్పటికే నివేదించింది. డెల్టా వేరియంట్ కన్నా డెల్టా ప్లస్ ప్రమాదకరమనే ఆధారాలు లేవని ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు (Director of Public Health Srinivasa Rao) వివరించారు. రాష్ట్రంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కాలేదన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ (Delta Plus variant)ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.. మూడో దశ కరోనా (Corona Third Wave) ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నెల రోజుల్లో ప్రభుత్వాసుపత్రుల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్ సమకూరుస్తామని వివరించారు.
ఇప్పటివరకు 1.14 కోట్ల డోసులు
వ్యాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో డీహెచ్ పొందుపరిచారు. రాష్ట్రంలో 1.14 కోట్ల డోసులు ఇచ్చామని తెలిపారు. 16.39 లక్షల మందికి రెండు డోసులు.. 81.42 లక్షల మందికి ఒక డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. మరో 1.75 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. విద్యా సంస్థల్లో 1.40 లక్షలమంది సిబ్బందికి వ్యాక్సిన్లు ఇచ్చామన్న శ్రీనివాసరావు.. విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం 11 కేంద్రాల్లో టీకాలు వేశామన్నారు. సరాసరి రోజుకు 1.12 లక్షల కరోనా పరీక్షలు చేస్తున్నామని హైకోర్టుకు నివేదించిన డీహెచ్ శ్రీనివాసరావు.. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 0.78 శాతానికి తగ్గిందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు, గరిష్ఠ ధరలపై ఉత్తర్వులు ఇచ్చామన్నారు. జీవో ఉల్లంఘిస్తే ప్రైవేట్ వైద్య కేంద్రాల (Private medical centers)పై చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 231 ఆస్పత్రులపై 594 ఫిర్యాదులు వచ్చాయన్న డీహెచ్.. 38 ఫిర్యాదుల్లో బాధితులకు 82 లక్షల 64 లక్షలు ఇప్పించామని తెలిపారు.
మొత్తం రూ.52 కోట్ల జరిమానా
మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని పోలీస్, జైళ్ల శాఖలు హైకోర్టుకు నివేదించాయి. మాస్కులు ధరించని వారిపై కేసులు నమోదు చేస్తున్నామని వివరించాయి. గతనెల 20 నుంచి ఈ నెల 5 వరకు 87,890 కేసులు నమోదు చేశామన్న డీజీపీ మహేందర్‌రెడ్డి.. మాస్కులు ధరించని వారికి రూ.52 కోట్ల జరిమానా విధించామన్నారు. ఖైదీలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందన్న జైళ్ల శాఖ డీజీ.. 732 మంది ఖైదీలకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. 6,127 ఖైదీలకు సింగిల్ డోసు వ్యాక్సిన్ (Single dose vaccine) ఇచ్చామని.. మరో 1,244 మంది ఖైదీలకు టీకాలు ఇవ్వాల్సి ఉందని జైళ్ల శాఖ డీజీ హైకోర్టుకు వివరించారు.
ఆన్‌లైన్ బోధన మార్గదర్శకాలను పాఠశాల విద్యా డైరెక్టర్ (Director of School Education) హైకోర్టుకు సమర్పించారు. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ తరగతులే (Online Classes) నిర్వహిస్తున్నామన్న డీఎస్ఈ శ్రీదేవసేన.. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాగోగులు చూస్తున్నామని వివరించారు. ఒక్కో చిన్నారికి ఒక నోడల్ అధికారిని నియమించామన్న శిశు సంక్షేమ శాఖ తెలిపింది. వర్షాకాలంలో దోమల నియంత్రణకు చర్యలు చేపట్టామని జీహెచ్ఎంసీ వెల్లడించింది.
ఇదీ చూడండి: HIGH COURT: ఆన్‌లైన్ క్లాసులకు ఫీజులతో ముడిపెట్టొద్దు