ఏటా ఏప్రిల్ 14వ తేదీ నుంచి 20 వరకు అగ్నిమాపక శాక అవగాహన సదస్సులను నిర్వహిస్తుండగా.. బుధవారం ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులోభాగంగా ఈ శాఖ అధికారులు.. ‘ఫైర్ అలారం ధర రూ.800.. స్మోక్/ఫైర్ డిటెక్టర్ ధర రూ.1,200, ఫైర్ ఎక్స్‌టింగ్‌షర్‌కు రూ.3,000.. వీటి మొత్తం ధర రూ.5,000. మరి, మీ కుటుంబం విలువ రూ.5,000 కంటే తక్కువా?’ అంటూ ప్రజలకు అర్థమయ్యేలా, వారిని ఆలోచింపజేసేలా ప్రచారం చేస్తున్నారు. ఇళ్లల్లో వ్యక్తిగతంగా ఇంతటి తక్కువ ఖర్చుతో అగ్నిమాపక పరికరాల్ని ఏర్పాటు చేసుకుంటే.. ప్రమాదాల నుంచి సులువుగా తప్పించుకోవచ్చు అంటూ వివరిస్తున్నారు.
గ్యాస్ లీక్ జరిగితే..
గ్యాస్ లీక్ అయితే వెంటనే రెగ్యులేటర్ వాల్వు ఆపేయండి. ఎలక్ట్రికల్ స్విచ్‌లు ఆన్/ఆఫ్ చేయొద్దు. దేవుని దీపాలు, అగర్‌బత్తీలు ఆర్పివేయాలి. కిటికీలు, తలుపులను తెరవాలి. గ్యాస్ లీక్ అయి అగ్నిప్రమాదం సంభవించిన సందర్భాల్లో రెగ్యులేటర్ వాల్వును ఆఫ్ చేసే అవకాశం లేకపోతే తడిసిన గోనెసంచి/తడిబట్టను మండుతున్న సిలిండర్‌పై వేస్తే మంట ఆగిపోతుంది. ఎల్‌పీజీ గ్యాస్‌కు సంబంధించిన సహాయానికి 1906 నంబర్‌కు కాల్ చేయాలి.
పొగలో చిక్కుకుపోతే..
హోటళ్లు, దుకాణ సముదాయాలు తదితర ప్రదేశాల్లో అగ్నిప్రమాదాలు సంభవించి, పొగలో చిక్కుకుపోతే వెంటనే ఫైర్ అలారం మోగించాలి. దగ్గరలో ఉన్న మెట్ల ద్వారా బయటికి రావాలి. లిఫ్ట్‌ను వినియోగించొద్దు. ముఖానికి తడి కర్చీఫ్/టవల్ చుట్టుకుని మెల్లగా శ్వాస పీల్చుతూ నేలపై పడుకొని పాకుతూ బయటికి రావాలి.
విద్యుత్తు ద్వారా అగ్నిప్రమాదాలు సంభవిస్తే..
షార్ట్‌సర్క్యూట్ ద్వారా విద్యుత్తు పరికరాలకు నిప్పంటుకుంటే మంటలను నీళ్లతో ఆర్పొద్దు. ఇలా చేస్తే కరెంట్ షాక్ తగిలి ప్రాణాపాయం కలగొచ్చు. విద్యుత్తు సరఫరా నిలిపివేసి పొడి ఇసుకతో మంటను ఆర్పాలి. ఎలక్ట్రిక్ షాక్‌కు గురైన వ్యక్తికి అధిక మోతాదులో నీటిని ఇవ్వాలి. విద్యుత్తుకు సంబంధించిన సహాయానికి 1555333కి కాల్ చేయాలి.
ఇదీ చూడండి: వాట్సాప్ పింక్‌లుక్ పేరుతో మాయాజాలం