దేశవ్యాప్తంగా క్రమంగా విమాన ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) నుంచి జులై నెలలో 7 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. విమానాశ్రయంలో పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలు, డిజిటలైజేషన్‌తో విమాన ప్రయాణాలపై విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు.
విమానాశ్రయాలు క్రమంగా రద్దీగా కనిపించడం వల్ల కొత్త గమ్యస్థానాలకు విమాన సర్వీసులకు ప్రారంభించడం, పాతవాటిని పునరుద్ధరిస్తున్నామని అధికారులు వివరించారు. విమానాశ్రయం నుంచి జులైలో విమానాల రాకపోకల్లో గణనీయమైన పెరుగుదల కనిపించిందని పేర్కొన్నారు. జూన్ 1న కేవలం 100 వరకు విమానాల రాకపోకలు జరగ్గా... జులై 25 నాటికి అవి 288కి చేరుకున్నాయన్నారు. జులైలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 8 వేల కంటే ఎక్కువ విమానాల రాకపోకలు సాగించాయని వివరించారు.
విమానాశ్రయం నుంచి వచ్చిపోయే రోజువారీ ప్రయాణీకుల సంఖ్య రెండు నెలల్లో మూడింతలైందన్నారు. జులై నెలలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 6.8 లక్షల మంది దేశీయ ప్రయాణికులు, 50,000 మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు జరిగాయని తెలిపారు. ఇటీవలే.. హైదరాబాద్ నుంచి శ్రీనగర్‌కు వారానికి నాలుగు రోజులు సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం నేరుగా విమాన సర్వీసులను నడుపుతోందని వివరించారు.
రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచి మరో నాలుగు కొత్త రూట్లు కూడా ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 22 నుంచి హైదరాబాద్ నుంచి మాలేకు విమాన సర్వీసులు పున:ప్రారంభిచామని విమానాశ్రయ అధికారులు వివరించారు.
ఇదీ చూడండి: Malay: శంషాబాద్ నుంచి మాలేకు విమాన సర్వీస్ పునఃప్రారంభం