రాష్ట్రంలో జాతీయ రహదారులు 3,900 కి.మీ. దాటిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ- మహారాష్ట్రను కలుపుతూ మరో జాతీయ రహదారి, రూ.1,566 కోట్లతో సూర్యాపేట- ఖమ్మం జాతీయ రహదారి నిర్మాణం జరగనున్నాయని తెలిపారు.
హైదరాబాద్ నుంచి వరంగల్‌కు జాతీయ రహదారిని సీసీ రోడ్డుగా నిర్మించినట్లు పేర్కొన్నారు. రూ.1870 కోట్లతో 99 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మించినట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఓఆర్‌ఆర్ నుంచి మెదక్ వరకు రూ.427 కోట్లతో రహదారి అభివృద్ధి, మంచిర్యాల నుంచి మహారాష్ట్ర సరిహద్దుల వరకు మరో జాతీయ రహదారి అభివృద్ధి నిర్మాణం చేపట్టినట్లు వివరించారు.
జాతీయ రహదారుల ద్వారా రాష్ట్ర ముఖచిత్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మార్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్ హైవేను కేంద్రం చేపట్టింది. కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనుల కోసం రాష్ట్రం భూసేకరణ చేయడం లేదు. భూసేకరణలో జాప్యం వల్లే పనులు ఆలస్యంగా జరగుతున్నాయి. భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి ఇప్పటికే ఎన్నో లేఖలు రాశాం.
--- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
భూసేకరణలో జాప్యం వల్లే పనుల్లో ఆలస్యం: కిషన్ రెడ్డి
అంబర్‌పేటలో ఫ్లైఓవర్ నిర్మాణానికి మూడేళ్ల క్రితం శంకుస్థాపన చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయకపోవటం వల్లే పనులు మొదలు కాలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే కొత్త ప్రాజెక్టులను కేంద్రం చేపడుతోందని స్పష్టం చేశారు. నిధుల కొరత రాకూడదనే ఉద్దేశంతోనే కొత్త ప్రాజెక్టులు మొదలుపెడతామని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి కేంద్రం సుముఖంగా ఉందని... ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన రీజనల్ రింగ్‌రోడ్డు పనులు పూర్తి కాగానే రాష్ట్రంలో ప్రాజెక్టు మొదలుపెట్టనున్నట్లు వ్యాఖ్యానించారు.