Teachers Transfer issue in Telangana : కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయించిన ప్రభుత్వానికి.. జిల్లా మారిన వారికి ఆయా పాఠశాలలకు పోస్టింగ్‌లు ఇవ్వడం కత్తి మీద సాములా మారింది. సీనియారిటీ ఆధారంగా జిల్లాలు కేటాయించాక సాధారణ అభ్యంతరాలతో పాటు వేల సంఖ్యలో దంపతుల(స్పౌస్) విభాగం కింద అర్జీలు రావడంతో వారిని సర్దుబాటు చేయడంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒక్కో జిల్లా నుంచి శనివారం ఇద్దరు ఆపరేటర్లు, ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుడిని హైదరాబాద్‌కు పిలిపించి అర్జీలను పరిశీలిస్తూ కంప్యూటర్‌లో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియను సోమవారం నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులున్నారు. ప్రభుత్వం డిసెంబరు 23న జారీ చేసిన ఉత్తర్వు 1655 ప్రకారం 7 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవ్వాలి. ఆ ప్రకారం గతనెల 30న పోస్టింగ్‌లు ఇవ్వాల్సి ఉంది. వారు ఆ తర్వాత మూడు రోజుల్లో విధుల్లో చేరాలి. కానీ ఇప్పటివరకు అభ్యంతరాలను కూడా పరిష్కరించలేకపోయారు.
ఇతర జిల్లాల నుంచి వచ్చేవారికి ఇస్తారా?
Telangana Teachers Transfer issue : భార్యాభర్తల విభాగంలోనే రెండు రకాల వారున్నారు. ఉమ్మడి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న దంపతులకు కొత్త జిల్లాలో పోస్టింగ్‌లు ఇవ్వడం ఒకటికాగా.., ఇతర ఉమ్మడి జిల్లాల్లో పనిచేస్తున్న ఒకరిని మరో ఉమ్మడి జిల్లాకు బదిలీ చేసి దంపతులకు ఓ కొత్త జిల్లాలో పోస్టింగ్ కేటాయించడం మరొకటి. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న దంపతులకు పోస్టింగ్‌లు ఇస్తున్నారని అనుకున్నారు. తాజాగా ఇతర జిల్లాల నుంచి వచ్చే వారి దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకొని సర్దుబాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇలా చేయడం క్లిష్టంగా మారింది. దానిపై ప్రభుత్వ నిర్ణయం కోసం అధికారులు నిరీక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల్లో దంపతుల పోస్టింగ్‌లను ఖరారు చేసిన అధికారులు కంప్యూటర్‌లో నమోదు చేసి సిద్ధంగా ఉంచారు. ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఉత్తర్వులు ఆయా ఉపాధ్యాయులకు వెళ్లిపోతాయి. ఖాళీలకు మించి దరఖాస్తులు రావడంతో సమస్యగా మారింది. అదే సమయంలో భార్యాభర్తల కేటగిరీ కింద అందరికీ పోస్టింగ్‌లు ఇస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఇతర ఉపాధ్యాయులు వాపోతున్నారు.
సాగని బోధన
Teachers Transfer in Telangana : పలు జిల్లాల్లో సీనియారిటీలో అవకతవకలు జరిగి జిల్లాల కేటాయింపు మారడం, వాటిని సరిదిద్దకుండా సాగతీస్తుండటంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. గత 15 రోజులుగా పాఠశాలల్లో బోధన నామమాత్రంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయులు విధులకు హాజరవుతున్నా బోధనపై దృష్టి పెట్టలేని పరిస్థితి ఉందని కొందరు హెచ్‌ఎంలు పేర్కొంటున్నారు. త్వరలో సంక్రాంతి సెలవులున్నాయి. ఈక్రమంలో దాదాపు నెల పాటు విద్యార్థులకు నష్టం జరిగినట్లేనని చెబుతున్నారు.