Hero pawan kalyan: ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య ప్రదర్శించిన మీనాక్షి కల్యాణం నృత్యరూపకం నయనానందకరంగా సాగింది. నాట్యగురువు పసుమర్తి రామలింగశాస్త్రి దర్శకత్వంలో సౌజన్య కళాకారుల బృందం చక్కటి హావభావాలతో నృత్యం చేసి కళాప్రియులను మంత్రముగ్ధుల్ని చేశారు. మీనాక్షి పాత్రలో ఆమె అద్భుతమైన అభినయం చూపారు. రంగారెడ్డి జిల్లా మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం సాయంత్రం ఈ నృత్యప్రదర్శన ఏర్పాటైంది. కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్, దర్శకుడు త్రివ్రికమ్ శ్రీనివాస్, సంగీత దర్శకులు తమన్, నటుడు తనికెళ్ల భరణి తదితరులు హాజరై కళాకారులను అభినందించారు.
అమ్మవారిని చూసినట్లే అనిపించింది...
మన సంస్కృతి, సంప్రదాయాలను, కళలను గౌరవించుకోవాల్సిన అసవరం ఎంతైనా ఉందని సినీనటుడు పవన్‌కల్యాణ్ అన్నారు. కూచిపూడి లాంటి సంప్రదాయ కళలను పరిరక్షించుకొని భావితరాలకు అందించాలన్నారు. కళలను సంస్కృతిని గౌరవించుకోకపోతే... సరస్వతి దేవికి అవమానం చేసినట్లే అవుతుందని పేర్కొన్నారు. మీనాక్షి పాత్రలో సౌజన్య చూస్తుంటే నిజంగా అమ్మవారిని చూసినట్లు అనిపించిందన్నారు.
మన సంస్కృతి, సంప్రదాయాలను, కళలను గౌరవించుకోకపోతే... సరస్వతి దేవికి అవమానం చేసినట్లవుతుంది. కానీ మీరు చాలా చక్కగా సంస్కృతి, సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను.- పవన్‌కల్యాణ్, సినీనటుడు
అందుకే కూచిపూడి కళ బతికుంది...
ఒక కథను అర్థమయ్యే విధంగా కళ్లకు కట్టినట్లు కూచిపూడి నృత్య ప్రదర్శనతో చూపించారని ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నారు. అందుకే కూచిపూడి కళ ఇనాళ్లు బతికుందని... భవిష్యత్‌లో కూడా బతికేఉంటుందని తెలిపారు.
కళాప్రియులను మంత్రముగ్ధుల్ని చేసిన మీనాక్షి పాత్ర...
సౌజన్య శ్రీనివాస్‌తో పాటు ఆమె బృందం చక్కటి హావభావాలతో లయబద్దంగా నృత్యం చేసి కళాప్రియులను మంత్రముగ్ధుల్ని చేశారు. మీనాక్షి పాత్రలో సౌజన్య శ్రీనివాస్ ప్రదర్శించిన అద్భుతమైన నృత్యాభినయంతో చూపరులను కట్టిపడేశారు. దాదాపు 60 మంది కళాకారులతో ఆద్యంతం లయాత్మకంగా సాగింది. మీనాక్షి కల్యాణం కథ ఇతివృత్తంగా ఆమె జననం నుంచి పరిణయం వరకు సాగిన కీలక ఘట్టాలను కళాకారులు చూడముచ్చటైన తమ నృత్యాభినయంతో కళ్లముందు ఆవిష్కరించారు.
ఇదీ చదవండి: Papikondalu Boat Tourism resume : పర్యాటకులకు గుడ్‌న్యూస్.. పాపికొండలు యాత్ర పునఃప్రారంభం