Dalit Bandu app : దళితబంధు పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో, ఖమ్మం జిల్లా చింతకాని, నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో పైలట్ పద్ధతిన పథకాన్ని అమలు చేస్తున్నారు. హుజూరాబాద్‌లో కొన్ని యూనిట్లను ఇప్పటికే మంజూరు చేశారు. మిగతా యూనిట్ల మంజూరు ప్రక్రియను త్వరలో వేగవంతం చేయనున్నారు. నాలుగు మండలాల కోసం నిధులు ఇప్పటికే విడుదల చేశారు. మండల, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. త్వరలోనే వారికి శిక్షణ ఇచ్చి పథకం అమలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ప్రతి కుటుంబానికో డీపీఆర్
అటు మిగతా నియోజకవర్గాల్లోనూ వంద చొప్పున కుటుంబాలకు కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే పథకాన్ని అమలు చేయనున్నారు. సంబంధించిన ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. దళితబంధు పథకాన్ని పక్కాగా అమలు చేసేలా, పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉండే విధానం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పథకం కింద లబ్ధి పొందనున్న ప్రతి కుటుంబానికి ఒక సవివర ప్రాజెక్టు నివేదికను తయారు చేయనున్నారు. కుటుంబ పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు, వారికున్న అనుభవం, నైపుణ్యాలు, ఆసక్తి, సాధ్యాసాధ్యాలు తదితరాలను క్రోడీకరించి ఈ డీపీఆర్ సిద్ధం చేస్తారు. దాని ఆధారంగా యూనిట్ ఎంపిక సహా ఇతరత్రా ప్రక్రియ చేపడతారు.
ప్రత్యేక రీసోర్స్ బృందాల ఏర్పాటు
యూనిట్ల ఎంపిక విషయంలో లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ అభివృద్ధిశాఖ 35 రకాల యూనిట్ల జాబితాను సిద్ధం చేసింది. అయితే లబ్ధిదారుపై ఎలాంటి ఒత్తిడి ఉండరాదని, ఇదే సమయంలో వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే దిశగా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం డెయిరీ, తయారీ రంగాలు, ఆటోమొబైల్, పరిశ్రమలు, ఇలా ఆయా రంగాల ప్రతినిధులతో రీసోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. లబ్ధిదారుల ఆసక్తిని తెలుసుకొని ఆయా రంగాలకు సంబంధించిన అంశాలపై వారికి అవగాహన కల్పిస్తారు. అన్ని అంశాలను పూర్తి స్థాయిలో వివరించి యూనిట్లు ఎంపిక చేసుకునేలా చర్యలు తీసుకుంటారు.
పోర్టల్‌తో పాటు మొబైల్ యాప్ తెచ్చే యోచన
Dalit bandu portal : అటు పథకం అమలు తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పర్యవేక్షించి ఫలితాలను విశ్లేషించేలా ఏర్పాటు చేసేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా పోర్టల్‌ను అభివృద్ధి చేయడంతో పాటు మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సమగ్ర కుటుంబ సర్వే, అధికారుల సర్వే ఆధారంగా వచ్చిన డేటాబేస్, డీపీఆర్‌లతో పాటు అన్ని అంశాలను అందులో పొందుపర్చనున్నారు. యూనిట్ మంజూరు, ఇచ్చిన శిక్షణ, అమలు సమయంలో పురోగతి, ఆదాయ వ్యయాలన్నీ ఆన్లైన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. యూనిట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని దళితబంధు కోసం ఉండే ప్రత్యేక బ్యాంకు ఖాతాలోనే జమ చేసేలా లబ్ధిదారున్ని ప్రోత్సహించనున్నారు. తద్వారా ఫలితాలను కూడా విశ్లేషించవచ్చన్నది సర్కార్ ఆలోచన. పోర్టల్ ఆధారంగా మొబైల్ అప్లికేషన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లినపుడు యాప్ సహాయంతో వివరాల పరిశీలనతో పాటు నమోదుకు కూడా అవకాశం ఉండేలా చర్యలు తీసుకుంటారు.
ఇదీ చూడండి: Interest on Dalit Bandhu Funds : దళితబంధు అమలయ్యే దాకా వడ్డీ చెల్లింపు