ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై మైలార్ దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్ పరిధిలోని 38 మున్సిపాలిటీల్లోని 2,569 పోలింగ్ కేంద్రాల్లో డిసెంబర్ 1న నిర్వహించనున్న ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రాజేంద్రనగర్, మైలార్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి... బందోబస్తుపై సూచనలు చేశారు.
ఇప్పటికే గుర్తించిన 243 సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్న ఆయన... పది ప్రాంతాల్లో సీసీటీవీ మౌంటెడ్ వెహికిల్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిద్వారా ఎన్నికల వేళ జరిగే పరిణామాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరవేస్తారన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా సైబరాబాద్‌లోని 38 డివిజన్లకు దాదాపుగా 13,500 మంది పోలీస్ సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వీరితో పాటు డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని వివరించారు.
ఇదీ చదవండి: పుస్తకాలను చదవడమే కాదు.. ఈ పరికరంతో వినవచ్చు!