సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఎన్నికల సన్నద్ధతను తెలుసుకున్నారు. కలెక్టర్లు ఎన్నికల ప్రక్రియపై పూర్తి స్థాయి దృష్టి సారించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఎక్కువ స్థానాలున్న చోట ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో తొలిసారి పెద్దఎత్తున కార్పొరేషన్లు, పురపాలికలకు ఎన్నికలు జరుగుతున్నందున సిబ్బంది నియామకం, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎస్ తెలిపారు. ఎక్కువ కార్పొరేషన్లు, పురపాలికలున్న రంగారెడ్డి, మేడ్చల్, మంచిర్యాల, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అధికారులకు సెలవులు రద్దు
మున్సిపల్ కమిషనర్లు... కలెక్టర్లు ప్రతి దశలోనూ సమన్వయం చేసుకోవాలని పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ సూచించారు. ఎన్నికలకు సంబంధించిన నివేదికలను క్రమం తప్పకుండా పంపాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధమున్న ఏ అధికారికీ సెలవులు మంజూరు చేయరాదని.... అనుమతి లేకుండా గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఇదీ చూడండి: మున్సిపాలిటీగా అవతరించిన నందికొండ కథేంటీ...!