CS Somesh kumar about musi floods : రాబోయే వర్షాకాలంలో గత రెండేళ్లలో తలెత్తిన వరద కష్టాలు కనిపించొద్దు. ఆయా కాలనీలు మునగొద్దు. ఇరుకైన నాలాలతో వరద ప్రవాహం ఆగొద్దు. 90శాతం వరద సాఫీగా మూసీకి సాగిపోవాలి. ఇదీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జీహెచ్‌ఎంసీ ముందుంచిన లక్ష్యం. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఆయన నగరంలోని నాలాల అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. కమిషనర్ లోకేశ్‌కుమార్, వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఎన్‌డీపీ) ఇంజినీర్లతో, జోనల్ కమిషనర్లతో మంగళవారం సమావేశమయ్యారు. నాలా పనులు చేపట్టే గుత్తేదారుల జాబితా, చరవాణి నంబర్లు తీసుకున్నారు. ఈ సందర్భంగా.. నిధుల సమస్య లేదని, బ్యాంకు రుణం ద్వారా నిధులు సమీకరించి వెంటనే బిల్లులు మంజూరు చేస్తామన్న భరోసాను గుత్తేదారుల్లో కల్పించాలని సర్కారు అధికారులకు స్పష్టం చేసింది. అవసరమైతే.. నాణ్యత, వేగంతో పనిచేసే గుత్తేదారులకు తగ్గట్లు టెండరు నియమనిబంధనలు రూపొందించి, వాళ్లతోనే పనులు పూర్తిచేసేలా చొరవ తీసుకోవాలని సూచించింది. రాబోయే వానాకాలానికి.. గతంలోని వరద ప్రభావిత ప్రాంతాలన్నింటిలో నాలాల విస్తరణ 100శాతం పూర్తవ్వాలని లక్ష్యం నిర్దేశించింది.
రోజూ పర్యవేక్షించాలి..
ఎస్‌ఎన్‌డీపీ కింద చేపట్టాల్సిన 15 ప్యాకేజీల్లో 52 పనులు చేపట్టాల్సి ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో చేపట్టాల్సిన పనులన్నింటికీ ఇప్పటికే ఇంజినీర్లు టెండరు ప్రక్రియ ప్రారంభించారు. 15 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఇకపై ప్రతి మంగళవారం సమీక్షిస్తానన్నారు. వాటిని పట్టాలెక్కించి, పూర్తి చేసే వరకు నిత్యం సమీక్షించే బాధ్యతను సర్కిళ్ల స్థాయిలోని బృందాలు చూడాలన్నారు. జోనల్ కమిషనర్లు సైతం అన్ని నాలాల పనులు నిత్యం పర్యవేక్షించాలని, క్షేత్రస్థాయిలో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించాలన్నారు. ఒకే నాలాను పూర్తిస్థాయిలో విస్తరించాలంటే భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం వంటి సమస్యలు తలెత్తుతాయని, వాటిని అధిగమించేందుకు ఒక నాలాను, మూడు వీధుల ద్వారా తీసుకెళ్లి మూసీకి కలిపేలా ప్రణాళిక రచించినట్లు ఇంజినీర్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: KCR Meet Stalin: కేంద్ర విధానాలపై కలిసి పోరాడాలని నిర్ణయం.. బలమైన కూటమి దిశగా అడుగులు..!