రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నట్లు క్రెడాయ్ తెలంగాణ నూతన కమిటీ వెల్లడించింది. మార్కెట్ విలువలు పెంచడంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం వల్ల ఆ ప్రభావం కొనుగోలుదారులపై తీవ్రంగా పడిందని క్రెడాయ్ తెలంగాణ రాష్ట్ర ఛైర్మన్ రామచంద్రారెడ్డి, అధ్యక్షులు మురళీకృష్ణారెడ్డిలు ఆందోళన వ్యక్తం చేశారు. 2021-23 కాలానికి ఏర్పాటైన క్రెడాయ్ తెలంగాణ నూతన కార్యవర్గం నేడు సమావేశమైంది.
ఈ సందర్భంగా టీఎస్-బీపాస్ అమలులో జిల్లాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయని.. వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని ఛైర్మన్ రామచంద్రారెడ్డి, అధ్యక్షులు మురళీకృష్ణారెడ్డిలు విజ్ఞప్తి చేశారు. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ స్థిరాస్థి రంగం ఆశాజనకంగా ఉందని వివరించారు.