వృద్ధులు గౌరవప్రదమైన జీవితాన్ని సాగించేందుకు సీఆర్ ఫౌండేషన్ సేవలందించడం అభినందనీయమని రాష్ట్ర ఓఎస్డీ, సీఎంఓ, నిమ్స్ నెఫ్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ టి.గంగాధర్ అన్నారు. హైదరాబాద్ కొండాపూర్ లోని సీఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో మంచం పట్టే రోగుల కోసం నూతనంగా నిర్మించిన అసిస్టెడ్ హెల్త్ కేర్ ఫెసిలిటీ (ఐసీయూ) కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సీనియర్ సిటిజన్లలో చాలా మంది తమ మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు చాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అలాంటి వారి అవసరాలను గుర్తించి సేవలు చేయడం గొప్ప విషయమన్నారు.
ఓక వృద్ధాశ్రమంలో ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేయడం ఇదే మొదటిది కావచ్చని డాక్టర్ గంగాధర్ అన్నారు. వృద్ధులకు పోషకాహారం, వైద్య సదుపాయాలతో పాటు ఆనందకరమైన వాతావరణం కల్పించి సేవలందిస్తున్నందుకు సీఆర్ ఫౌండేషన్‌ను అభినందించారు. మంచం పట్టినా వారికి అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ నిమ్స్‌లో వైద్య సేవలందించడానికి తమవంతు సహకారం అందిస్తామని డాక్టర్ టి.గంగాధర్ హామీ ఇచ్చారు. ఐసీయూ నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందించిన వృద్ధాశ్రమ వాసులు ఎన్. రాజేందర్ రావు, సుగుణ, సుబ్బలక్ష్మి, ఎన్.ఆర్.స్వామి, ఇటీవలే స్వర్గస్తులైన అబ్బూరి ఛాయా దేవి, తమ్మారెడ్డి కనకరత్నంకు డాక్టర్ కె. నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సీఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వర్ రావు, కోశాధికారి వి.చెన్నకేశవ రావు, ఆరోగ్య కేంద్రం సంచాలకులు డాక్టర్ రజిని, రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డీఏంహెచ్ఓ డాక్టర్ సృజన, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అసోసియేషన్ అఫ్ ఇండియా ఛైర్మన్ డాక్టర్ బి. రంగారెడ్డి హాజరయ్యారు.
ఇదీ చూడండి: అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి: సీఎం కేసీఆర్