లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలు చేయడంపై పోలీసులు దృష్టిసారించారు. గ్రేటర్ పరిధిలో 276 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 180, సైబరాబాద్ పరిధిలో 50, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 46 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పోలీస్ కమిషనర్లు తనిఖీ కేంద్రాలను నేరుగా పర్యవేక్షిస్తున్నారు.
మినహాయింపు సమయంలో తప్పా... మిగతా సమయాల్లో ప్రజలు రహదారుల మీదకు రావొద్దని స్పష్టం చేశారు. అత్యవసర ప్రయాణాలు, రవాణా వాహనాల కోసం... ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే పాసులు జారీ చేస్తామని పోలీసుశాఖ వెల్లడించింది. అకారణంగా రహదారులపైకి వచ్చే వాళ్లను లాక్‌డౌన్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు... వాహనదారులపైనా విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఈ-పాస్ విధానం ద్వారా సంబంధిత కమిషనర్లు పాసులను జారీ చేస్తారని పోలీసులు వెల్లడించారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని... వారి ప్రయాణ టికెట్లు చూపిస్తే సరిపోతుందని తెలిపారు. వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందించనున్నారు.
ఈ-పాస్ కోసం https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా... పోలీస్ వెబ్ సైట్ ద్వారానే ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ఇదీ చూడండి: తెలంగాణకు తాళం పడింది.. అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్..